
ప్రజాశక్తి-విజయనగరం : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 21 నుండి 31 వరకు పలు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో గల 'స్మతి వనం'లో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించనున్నామన్నారు. అనంతరం స్మృతి పరేడ్ నిర్వహించి, ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధలు, జిల్లా అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లోను చదువుతున్న విద్యార్ధులకు 'లైంగిక వేధింపుల నుండి మహిళలకు, పిల్లలకు రక్షణ - సామాజిక పాత్ర' అనే అంశంపైన, పోలీసు ఉద్యోగులకు 'సోషల్ మీడియా దుర్వినియోగం మరియు సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ర' అంశంపైనా వక్తత్వ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిల్లో 26న 'ఓపెన్ హౌస్' కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. 27న 'మెడికల్ క్యాంపు', రక్తదానం పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని ఎస్‌పి తెలిపారు.