ప్రజాశక్తి - పార్వతీపురం : ఇంటింటికి ఓటరు జాబితా సర్వే ఈ నెల 21 నుండి జరుగుతుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం స్థానిక కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఓటరు సర్వే కుటుంబ పెద్ద నుండి జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రెండు దశలు ఉన్నాయని, రివిజిన్ వ్యవధిలో బిఎల్‌ఒలతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఏజెంట్‌ను నియమించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సూచించారు. 10 కంటే ఎక్కువ ఫారాలను బిఎల్‌ఒకు సమర్పించకూడదనే షరతులకు లోబడి ఎన్నికల సంఘం బూత్ లెవల్ ఏజెంట్లను అనుమతించిందని చెప్పారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్పించిన దరఖాస్తులు అన్నింటికీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు. డూప్లికేట్ ఎంట్రీలు, చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాల పరిశీలన, ఓటర్ల జాబితాలో సవరణలు ఉంటే వాటిని గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. చిరునామాను మార్చుకున్న ఓటర్ల వివరాలు, డోర్ నంబర్ అడ్రస్ వెరిఫికేషన్ (10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు) చేస్తారని చెప్పారు. ఇంటి నెంబర్లకు సంబంధించిన ఎంట్రీల సవరణకు ఫారం-8 సేకరిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, సెక్స్ వర్కర్స్, థర్డ్ జెండర్, పిడబ్ల్యుడి, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహం, పివిటిజి, అట్టడుగు వర్గాల ఓటర్లను నమోదు చేయడానికి తీసుకున్న చర్యలను నిర్ధారించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
2023 జూలై 21 నుండి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటింటా ఓటరు వివరాల విచారణ జరుగుతుందన్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబరు 29 వరకు ఓటరు కార్డుపై ఫోటో మిస్ మేచింగ్, క్లారిటీ లేకపోవడం, పోలింగ్ కేంద్రాల మార్పు వంటి అంశాలను పరిశీలన జరుగుతుందన్నారు. సమగ్ర ముసాయిదా జాబిత సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 16 వరకు జరుగుతుందని చెప్పారు. ముసాయిదా జాబితా అక్టోబరు 27న ప్రచురిస్తామని, అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకు అభ్యంతరాలు, క్లైమ్‌లు సమర్పించవచ్చని తెలిపారు. అభ్యంతరాలు, క్లైమ్ లు డిసెంబరు 26 నాటికి పరిష్కరిస్తామన్నారు. తుది ఓటరు జాబితాను 2024 జనవరి 5న ప్రచురిస్తామన్నారు. అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అక్టోబరు 28, 29, నవంబరు 18, 29 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 2023 అక్టోబరు 1నాటికి, 2024 జనవరి 1 నాటికి అర్హత కలిగి నమోదు చేసుకోని అభ్యర్థులను నమోదు చేయడం,
ఇంటింటికి ధవీకరణ మొదటి రోజున ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య బిఎల్‌ఒలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత పోలింగ్ స్టేషన్లోని ఓటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ ప్రత్యేక ప్రచార రోజుల్లో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల పాటు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు చెందిన ఓటర్ల జాబితాలను పరిశీలన, సవరణలు మొదలైన వాటిని గుర్తించడానికి ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు సంబంధిత పోలింగ్ స్టేషన్లలో పెట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రీ-రివిజన్ కార్యకలాపాల సమయంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రతి బుధవారం, ఓటరు నమోదు అధికారులు ప్రతి మంగళవారం రాజకీయ పార్టీలతో వారానికో సారి సమావేశాలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జెసి ఆర్.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎం.బాపూజీ నాయుడు (వైసిపి), పారిసర్ల అప్పారావు (బిజెపి), గొట్టాపు వెంకట నాయుడు (టిడిపి), జాగాన భాస్కరరావు (కాంగ్రెస్), పి.రాజశేఖర్ (సి.పి.ఎం), పైలా శ్రీనివాసరావు (జనసేన) తదితరులు పాల్గొన్నారు.










