ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర మంగళవారం ఉదయం నూజెండ్ల మండలం ముప్పరాజువారిపాలెం వద్ద పల్నాడు జిల్లాలోకి ప్రవేశించనుంది. దాదాపు 15 రోజులపాటు పల్నాడు, గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తారు. వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు మీదుగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. పల్నాడు, గుంటూరు జిల్లాలు ముగిసిన తరువాత ఎన్‌టిఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటి వరకు ఆరు ఉమ్మడి జిల్లాలు పూర్తిచేసి ఏడో జిల్లాలోకి ప్రవేశించనుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పాదయాత్ర పార్టీకి ఒక టానిక్‌లా పనిచేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పార్టీ నిస్తేజంగా ఉన్న ప్రాంతాలపై ఆయన దృష్టి సారించారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంచుతూ కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. పాదయాత్రలో వివిధ తరగతుల ప్రజలను ఆయన కలుస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ఆయా తరగుతుల ప్రజలకు ఏమి మేలు చేయగలనో హామీలు ఇస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలతోపాటు వైసిపి ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతిపైనా ఎండగడుతున్నారు. ఇదేరీతిలో పల్నాడులో వైసిపి ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతి అక్రమాలపై లోకేష్ ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో లోకేష్ పర్యటనపై వైసిపి నాయకుల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. లోకేష్ ఏ విధమైన విమర్శలు చేస్తారు? వాటికి తాము ఎలా బదులు ఇవ్వాలో కూడా వైసిపి ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు సిద్ధం అవుతున్నారు.
పల్నాడు జిల్లాలో ఒక్కొ నియోజకవర్గంలో ఒక్కో తరహాలో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు జిల్లా నాయకులు ఇప్పటికే లోకేష్ బృందానికి సమాచారం పంపారు. ఆయా అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను, ఇవ్వాల్సిన హామీలను, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పథకాలు నిలిచిపోయిన వైనంపై ఇప్పటికే ఆయన సమాచారం తెప్పించుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో తరచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో కొంత మంది ఎమ్మెల్యేల తీరును కూడా ఆయన దుయ్యబట్టనున్నారు. ఇటీవల వినుకొండలో జరిగిన ఘర్షణ, గతంలో నర్సరావుపేట, గురజాల, మాచర్లలో జరిగిన ఘటనలను కూడా ఇప్పటికే లోకేష్ అధ్యయనం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పల్నాడు జిల్లాలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లోకేష్ పర్యటన కార్యకర్తల్లో ఉత్సాహం, భరోసా తెస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైసిపి నాయకుల దాడులకు భయపడి బయటకురాని వారు లోకేష్ పర్యటనతో బయటకు వస్తారని కూడా చెబుతున్నారు.
యువగళం పాదయాత్ర షెడ్యూల్
ఉదయం 8 అద్దంకి నియోజకవర్గం కెలంపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.20 గంటలకు కెలంపల్లిలో స్థానికులతో మాటామంతీ
8.35 గంటలకు వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం
8.55 గంటలకు ముప్పరాజువారిపాలెంలో స్థ్థానికులతో సమావేశం
10.10 గంటలకు రాముడుపాలెంలో స్థానికులతో సమావేశం
11.10 గంటలకు పుచ్చనూతల జెసి నగర్‌లో స్థానికులతో సమావేశం
11.40 గంటలకు రవ్వవరంలో స్థానికులతో సమావేశం
మధ్యాహ్నం 12.10 గంటలకు పుచ్చనూతలలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు పుచ్చనూతల నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.20 గంటలకు కొత్తరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం
4.40 గంటలకు లక్ష్మీపురంలో స్థానికులతో సమావేశం
5.40 గంటంలకు నూజెండ్లలో స్థానికులతో సమావేశం
రాత్రి 7.10 గంటలకు గుర్రపునాయుడుపాలెంలో రైతులతో సమావేశం
7.30 గంటలకు గుర్రపునాయుడుపాలెం శివారు విడిది కేంద్రంలో బస










