Aug 30,2023 22:39

మాట్లాడుతున్న సురేష్‌ కుమార్‌

* వ్యాపారి,కార్మికుడి ఘర్షణ
* ఆ నెపంతో పరిశ్రమల
* మూతకు నిర్ణయం
ప్రజాశక్తి- పలాస: 
పలాస-కాశీబుగ్గ ప్రాంతంలోని జీడి పరిశ్రమలను గురవారం నుంచి బంద్‌ చేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. జీడిపప్పు ఉత్పతి దారుల సంఘం కార్యాలయం భవనంలో బుధవారం నిర్వహించిన పలాస క్యాష్యూ మర్చెంట్‌ అసోసియేషన్‌ (పిసిఎంఎ) సమావేశం ఈ నిర్ణయం వెల్లడించింది. పొట్నూరు బాలాజీకి చెందిన ఓ పరిశ్రమలోని కార్మికుడు దొంగతనానికి పాల్పడి, తిరిగి తమ సభ్యుడిపైనే దాడి చేశారన్నది సంఘం నాయకుల ఆరోపణగా ఉంది. అయితే అసలు కధ వేరుగా ఉన్నట్లు ఆ ప్రాంతంలో చర్చ నడుస్తోంది. జీడిపప్పు మద్ధతు ధర, కొనుగోళ్లపై రైతులు చేపట్టిన ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. రైతులకు మద్ధతు ధర కల్పించడంపై ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తోందని మంత్రులు సైతం ఇటీవల ప్రకటించారు. మద్ధతు ధరపై రోజురోజుకీ వ్యాపారులపై ఒత్తిడి పెరుగుతోంది. రైతలు కోరుతున్న మద్ధతు ధరకు జీడి కొనడానికి ఇష్టం లేని వ్యాపారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఒక చోట పని చేసే క్రమంలో వ్యాపారికి,కార్మికుడి మధ్య ఏదో ఒక అంశంలో ఘర్షణ చోటు చేసుకోవడం సహజం. దానినే వారు భూతద్దంలో చూపి పరిశ్రమలు మూసేందుకు నిర్ణయించారని కార్మికులు చెప్తున్నారు. ఈ ఎడాది జూన్‌లో ఒకసారి బంద్‌ చేశారు. ఆర్ధిక మాంద్యం, కొనుగోలు లేకపోవడం కారణాలని చెప్పిన వ్యాపారులు తర్వాత మాట మార్చారు. రైతులు జీడిపిక్కలకు ఎక్కువ ధర అడగడం వల్ల వ్యాపారాలు సాగక మూసేసామని తర్వాత చెప్పారు. అప్పటికీ జీడి రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆ తర్వాత జీడి ఉద్యమం మరింత ఊపందుకుంది. బంద్‌ నిర్ణయం వెనుక కారణం ఇదే అన్న చర్చ ఆ ప్రాంతంలో నడుస్తోంది. బాధిత వ్యాపారి బాలరాజు మాట్లాడుతూ రూ.10 లక్షల విలువైన జీడి పప్పు రెండేళ్లలో మాయమైందని పోలీసు లకు పిర్యాధు చేశారు. మరి ఇన్నాళ్లు ఆ వ్యాపారి ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి
బంద్‌కు అంతా సహకరించాలి
పిసిఎంఎ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ తమ సభ్యుడిపై కార్మికుడు దాడి చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. దొంగతనం ఆరోపణలపై ప్రశ్నించడమే నేరమా అని ఆయన ప్రశ్నించారు. తమ బంద్‌కు అంతా సహకరించాలని కోరారు. నష్టపోయిన వ్యాపారికి సంఘీభావం తెలుపుతున్నామని, విషయం తేలేవరకు బంద్‌ చేస్తామని చెప్పారు. పిసిఎంఎ కార్యదర్శి పట్నాన రవికాంత్‌, సంఘ సభ్యులు మల్లా భాస్కరరరావు, బెల్లాల నారాయణరావు, కొత్తకోట తిరుమలరావు పాల్గొన్నారు.