Oct 15,2023 22:13

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌, ఎస్‌పి మేరీ ప్రశాంతి
తొలి దశలో ఇవిఎంలు, వివిప్యాట్‌లు చెకింగ్‌
వచ్చేనెల పదో తేదీ వరకూ పరిశీలన
ఎన్నికల నిబంధనల పాటించాలని రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్‌ విజ్ఞప్తి
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ నిర్వహణ
ప్రజాశక్తి - ఏలూరు

             జిల్లాకు వచ్చిన ఓటింగ్‌ యంత్రాల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి 20 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించే తొలిదశ తనిఖీ (ఎఫ్‌ఎల్‌సి) ప్రక్రియను చేపట్టేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఇవిఎం గొడౌన్‌లో ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న ఇవిఎంలు, వివిప్యాట్స్‌ ఫస్ట్‌ లెవిల్‌ చెకింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీనుంచి వచ్చేనెల పదో తేదీ వరకూ ఓటింగ్‌ యంత్రాల పనితీరు పరిశీలించేందుకు ఫస్ట్‌ లెవిల్‌ చెకింగ్‌ను పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఎల్‌సి పరిశీలనకు డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజును పర్యవేక్షకులుగా నియమించామన్నారు. ఓటింగ్‌ యంత్రాల పరిశీలన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నియమనిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని బెల్‌ కంపెనీ ఇంజినీర్లు, జాతీయ రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్‌ఎల్‌సి పరిశీలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఇప్పటికే జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చామన్నారు. ఈ పరిశీలనకు వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు గుర్తింపు కార్డుతో ఇవిఎంలు భద్రపరిచిన గిడ్డంగికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు బ్యాలెట్‌ యూనిట్లు 5560, కంట్రోల్‌ యూనిట్లు 4340, వివిప్యాట్లు 5210, కేటాయించగా వీటికి తొలిదశ పరిశీలన జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ, వివిధ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బందికి కూడా విధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఇవిఎం గొడౌన్‌లోకి ఎవ్వరూ కూడా మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ చేతి గడియారాలు, ఇయర్‌ ప్యాడ్స్‌ వంటివి అనుమతించబడవని స్పష్టంచేశారు. కలెక్టర్‌తోపాటు డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు, డిఎస్‌పి కృష్ణంరాజు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి బి.రమాదేవి, డిఐఒ నాగేశ్వరరావు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ చల్లన్నదొర ఉన్నారు.