జీలుగుమిల్లి:మండల కేంద్రం జీలుగుమిల్లిలో ఈనెల 26వ తేదీ ఆదివారం నుంచి జరిగే గిరిజన జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఎపి గిరిజన సంఘం జిల్లా నాయకులు తెల్లం దుర్గారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిరోజు ప్రతినిధుల మహాసభ, 27వ తేదీన జీలుగుమిల్లి రైస్‌మిల్లు గ్రౌండ్‌లో బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు మూడు వేల మంది హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలను హరిస్తున్నాయని విమర్శించారు. జీలుగుమిల్లిలో గిరిజన భూములను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు తుపాకుల ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా సర్వేలను నిర్వహిస్తున్నారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, సిఐటియు నేతలు మోడియం నాగమణి, ధర్ముల రమేష్, సిరిబత్తుల సీతారామయ్య, గుజ్జు నాగేంద్ర, దావీదు, అప్పారావు, మల్లేష్ పాల్గొన్నారు.










