ప్రజాశక్తి-పాడేరుటౌన్: పాడేరు ఐటిడిఎ గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు గిరి విజ్ఞాన సంబరాలను నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధం చేసింది. ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలకృష్ణ, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, డిఇఒ రమేష్ పర్యవేక్షణలో మూడు రోజుల విజ్ఞాన ప్రదర్శన నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ గిరి విజ్ఞాన సంబరాలకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వంలో కీలక హౌదాలో ఉన్న పలువురు ఐఎఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపి, ఎస్ టికమిషన్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు గిరి విజ్ఞాన సంబరాలు-2022 నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసామని టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు తెలిపారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల ఆవరణలో గిరి విజ్ఞాన సంబరాల ఏర్పాట్లపై డిడి పనులను మంగళవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరి విజ్ఞాన సంబరాలకు హాజరయ్యే అతిథులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సందర్శకులకు ఎక్క ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రీమలి జాన్, పి.ప్రసాద్, పి.కృష్ణారావు పిడిలు పి.పూర్ణరాజు, ఎస్.సింహాచలం పాల్గొన్నారు.
ఏర్పాట్లను పిఒ పరిశీలన
గిరి విజ్ఞాన సంబరాలను విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. తలారిసింగి జిటిడబ్ల్యూ బాలురు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించనున్న గిరి విజ్ఞాన సంబరాల ఏర్పాట్లను మంగళవారం పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 28, 29, 30 తేదీలలో గిరి విజ్ఞాన సంబరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటిడిఎ స్థాయిలో జరుగుతున్న గిరి విజ్ఞాన సంబరాల్లో 122 స్కూల్స్ నుండి విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ప్రతిరోజు క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఎటిడబ్ల్యూఒ ఎల్.రజని, పాఠశాల హెచ్‌ఎం ఆర్.జాన్, పలువురు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.










