Aug 24,2023 22:21

ర్యాలీలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా ప్లీనరీ సమావేశాలు శుక్ర, శనివారాల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. ప్లీనరీ సమావేశంలో భాగంగా గురువారం బాలుర కళాశాల గ్రౌండ్‌ నుండి అంబేద్కర్‌ కూడలి వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు మూడు నాలుగు ఐదు తరగతులను ప్రభుత్వం విలీనం చేసిందని అన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అర్హత కలిగిన విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో అందించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొల్పాలని కదిరి పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ను ప్రభుత్వ ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగర్జున, బాబావలి, బాబ్జాన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విజరు కుమార్‌, జిలాన్‌ భాష, అహ్మద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.