Aug 24,2023 20:30

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
          ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ఈ నెల 25 నుంచి ఏలూరు రేంజ్‌ పరిధిలో స్థానిక పోలీస్‌ గ్రౌండ్‌లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదశ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో దశ దేహదారుఢ్య పరీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 25వ తేదీ తెల్లవారుజాము నుంచి ఎంపిక పరీక్షలు ప్రారంభించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభ్యర్థులకు పిజికల్‌ మేనేజ్మెంట్‌ పరీక్ష (పిఎంటి), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పిఎటి) నిర్వహించనున్నారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో 9689 మంది అభ్యర్థులకు దశలవారీగా పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేస్తారు.
8247 మంది పురుష అభ్యర్థులు, 1142 మహిళా అభ్యర్థులు తమ సత్తాచాటనున్నారు. ఈ పరీక్షలు వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకూ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి అనంతరం ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌, జిరాక్స్‌ సెట్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
ఏలూరు రేంజ్‌ డిఐజి అశోకుమార్‌ స్వయంగా ఎంపిక ప్రక్రియను పరిశీలిస్తున్నారు. వర్షాలు కురిసినా అభ్యర్థులకు అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు ఈ పరీక్షలు సజావుగా సాగేలా చిత్తశుద్దితో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పారదర్శకంగా ఎంపిక పరీక్షలు చేపట్టాలన్నారు.