Aug 01,2023 22:39

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ మురళీకృష్ణ

- జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలు
- హాజరు కానున్న 1511 మంది అభ్యర్థులు
- జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
ఈనెల రెండు నుంచి 7వ తేదీ వరకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ తెలిపారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎపిపిఎస్‌సి ఆధ్వర్యాన పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజినీరింగ్‌ కళాశాల, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు 1,511 మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు వివరించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు ఉంటుందని, డిస్క్రిప్టివ్‌ టైప్‌లో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు సరిపడా ఆర్‌టిసి బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేయాలని, ఎవరికి అప్పగించిన విధులను వారు బాధ్యతతో నిర్వర్తించాలని ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు దృష్టిసారించాలన్నారు. సర్వీస్‌ రూల్స్‌ పుస్తకాలు మాత్రమే తీసుకురావాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురావద్దన్నారు. సమావేశంలో ఎపిపిఎస్‌సి అసిస్టెంట్‌ సెక్రటరీ బి.సిహెచ్‌ కుమార్‌రాజా, సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌, ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌, సెక్షన్‌ ఇన్‌ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.