ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఎపిపిఎస్‌సి ద్వారా అసిస్టెంట్ కన్సర్వేటర్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకూ వట్లూరులోని శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజీలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో నియామక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎవివిఎస్‌ఎన్.మూర్తి తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణపై పోలీసు, హెల్త్, విద్యుత్, లైజన్ ఆఫీసర్, ఎపిపిఎస్‌సి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ అసిస్టెంట్ కన్సర్వేటర్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు 180 మంది అభ్యర్ధులు హాజరవుతారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి సమయానికి ముందే హాజరు కావాలని సూచించారు. పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని, మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్ధులు కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్క్‌లు ధరించి పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. పరీక్షా కేంద్రానికి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. హాల్‌టిక్కెట్‌తోపాటు ఆధార్, పాన్‌కార్డు, ఓటరు ఐడి తదితర వాటిలో ఏదోక గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో హెల్త్ డిపార్టుమెంట్ తరపున డి.రవీంద్రబాబు, ఎపి ట్రాన్స్‌కో డిఇ ఝాన్సీ, ఎపి పబ్లిక్ సర్వీసు కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.ప్రవీణ, సెక్షన్ ఆఫీసరు టి.విజయలక్ష్మి, పోలీసు అధికారి ఎం.రాజా పాల్గొన్నారు.










