Sep 20,2023 23:00

గుంటూరులో యుజిడి కోసం చేసిన పనులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలకు ఈ సమావేశాల్లో కొంత మేరకైనా పరిష్కారం లభిస్తుందా లేదా? గతంలో మాదిరిగా ఇతర అంశాలపై పరిమితమై సమావేశాలు ముగుస్తాయా? అనేది అధికార, ప్రతిపక్ష సభ్యుల్లో సంశయం నెలకొంది.
వైసిపి ప్రభుత్వ హయాంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు దాదాపుగా ఇవే చివరి సమావేశాలుగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. యథాతథంగా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరిగితే ఫిబ్రవరిలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ సమావేశాలు జరుగుతాయని, లేదంటే షెడ్యూలు కన్నా ముందే ఎన్నికలు జరిగితే ఇవే చివరి సమావేశాలని ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో గుర్తింపు పొందలేని వారికి ఇదే చివరి ఛాన్సు అని కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజధాని అంశంలో కోర్టులో ఉన్నా దసరానుంచి విశాఖ నుంచి సిఎంవో పనిచేస్తుందని సిఎం జగన్‌ బుధవారం మంత్రి వర్గం సమావేశంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై రాజధాని రైతులు, అమరావతి జెఎసిలు ఇంకా తమ వైఖరిని వెల్లడించ లేదు. రాజధాని తరలింపును నిలిపివేస్తూ గతేడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఇంత వరకు ఈ అంశంపై విచారణ జరగలేదు. నవరబరులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాను దసరా నుంచి విశాఖ నుంచేపాలన చేస్తానని జగన్‌ ప్రకటనపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై అటు శాసన సభ, ఇటు మండలిలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులపై ప్రజా ప్రతినిధులు ప్రస్తావించనున్నారు. గుంటూరులో 2019లో నిలిచిపోయిన భూగర్భ డ్రెయినేజి పనులు, గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపునకు నిధులు విడుదల, వరికపూడిశెలకు కేంద్రం పర్యావరణ అనుమతి ఇచ్చినా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. ఈ అంశాలపై మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో ఏ పంటలు వేయకుండా భూములు ఖాళీగా ఉన్నాయి. ఇంత వరకు ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయలేదు. వర్షాభావం వల్ల పల్నాడు జిల్లాలో 11 మండలాల్లో కరువు పరిస్థితులు ప్రభుత్వం ఇంత వరకు ఈ కరువు మండలాల ప్రకటన చేయలేదు. కేంద్రం నుంచి నిధులు కోరలేదని వార్తలు వచ్చాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు నాయుడును అరెస్టు వ్యవహారంపై కూడా అసెంబ్లీలో చర్చకు పట్టుపడతామని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యల కంటే వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపైనే వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.