Sep 18,2023 00:23

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో మొదటిసారిగా ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పిజిటిఐ) ఆధ్వర్యాన ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు అంతర్జాతీయ గోల్ఫ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు తెలిపారు. దీనికి సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ సమీపంలోని ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యదర్శి మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ, ఈ పోటీలను తూర్పు నావికాదళం వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంథార్కర్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు. 18వ ప్రాక్టిస్‌ రౌండ్‌, 19న ప్రోయామ్‌ టోర్నమెంటు, సెప్టెంబరు 20 నుంచి 23 వరకు ప్రధాన టోర్నమెంటు జరుగుతాయని వివరించారు. ఈ నెల 23న ఇపిజిసిలో జరగనున్న బహుమతి ప్రదానోత్సవానికి ఎపి ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో భారతదేశంతో పాటు శ్రీలంక, కెనడా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, జపాన్‌ దేశాల నుంచి సుమారు 126 మంది క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఈ టోర్నమెంట్‌ను యూరో స్పోర్ట్‌, సోషల్‌ మీడియా స్ట్రీమింగ్‌ ఎబిపి వార్తలలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. దూరదర్శన్‌లో కూడా ప్రదర్శిస్తారని తెలిపారు. సామాన్యులకు కూడా అవగాహన కల్పించేందుకు నగరంలోని ప్రముఖ స్థలాల్లో హోర్డింగ్‌లు, టోర్నమెంట్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ట్రెజరర్‌ రామకృష్ణ, ఉపాధ్యక్షులు వినోద్‌బాబు, సభ్యులు నర్సింహరాజు పాల్గొన్నారు.