
ప్రజాశక్తి- విశాఖపట్నం : ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ ఇరిగేషన్ డ్రైనేజ్ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్ సమావేశాలు గురువారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది.
ముఖ్యమంత్రి ఉదయం 8:05 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8:50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9:30 నుండి 11:00 వరకు ఐసిఐడి 25వ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌కుమార్, జివిఎంసి కమిషనర్ సాయి కాంత్ వర్మతో కలిసి బుధవారం పరిశీలించారు. రాడిసన్ బ్లూహోటల్‌ను సందర్శించి, సమావేశ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో నిర్వహణ పరమైన లోటుపాట్లు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర దేశాల నుంచి మంత్రులు హాజరుకానున్నందున మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వహక ఇంజినీర్ ఉమేష్ కుమార్, భీమిలి రెవిన్యూ డివిజనల్ అధికారి భాస్కర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, కేంద్ర జల వనరుల శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.