
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి సంబంధించి సాగునీటి సలహామండలి(ఐఎబి) సమా వేశాలు నేటి నుంచి జరుగనున్నాయి. రబీకి సాగునీటి లభ్యత, సాగునీటి సరఫరా, సాగునీటి కొరతపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు చేయనున్నారు. మంగళవారం కాకినాడ జిల్లా, బుధవారం తూర్పు గోదావరి జిల్లా, గురువారం కోనసీమ జిల్లాల వారీగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగున్నాయి.
రబీకి సాగునీటి లభ్యతపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క గోదావరిలో నీటి నిల్వలు పడిపోవడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరిం చుకుంది. ఇందులో చేసే నిర్ణయాలపై అన్నదాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌లో ఎదురైన తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే రైతులు నానా కష్టాలను ఎదుర్కొన్నారు. అలాగే పంట చేతికొచ్చే సమయంలో అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల రైతుల పంటలను కోల్పోయారు. ఆధునికీకరణ పనులకు నోచుకోక కాలువలు పూడుకుపోయాయి. నీరు పుష్కలంగా అందే ఖరీఫ్ ఈ ఏడాది రైతులకు నీటిచుక్కను అందించలేకపోయింది. శివారు భూములు నీరు లేక బీటలు వారాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 431 కిలో మీటర్లు మేర ప్రధాన కాల్వలు ఉన్నాయి. మరో 2024 కిలో మీటర్ల మేర అనుసంధానమైన చిన్నకాల్వలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 4.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డిసెంబరు నుంచి మార్చి వరకు 92 టిఎంసిల నీటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గుతున్న తరుణంగా వీటిని ఎలా సేకరిస్తారు, ప్రత్యామ్నాయాలు ఎలా చూపుతారు అనేదానిపై సర్వత్రా చర్చజరుగుతోంది.
గతేడాది ఐఎబి సమావేశాలు నిర్వహించి కాల్వల ఆధునీకరణ, స్లూయిజ్‌లు ఏర్పాటు, డ్రెయిన్లు పూడికతీత పనులకు సుమారు రూ.60 కోట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు కేవలం గుర్రపు డెక్క తొల గింపు అక్కడక్కడక్కడా కాల్వల మరమ్మత్తులకు వినియోగించి మమ అనిపించారు. గత నాలుగేళ్లుగా ఐఎబి సమావేశాల ప్రాధాన్యత కోల్పోయింది. అత్యధిక మంది ఎంఎల్‌ఎలు అధికార పార్టీకి చెందిన వారే కావటంతో కీలకమైన ఐఎబి సమవేశాలను మొక్కుబడిగా సాగిస్తు న్నారు. అధికారుల అంచనాలకు తగ్గట్లుగా ప్రభుత్వం నిధులు కేటాయించలేక పోవడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రజా ప్రతినిధులు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.
పనిచేయని ఎత్తిపోతల పథకాలు
మెట్ట ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు పలుచోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను చేపట్టారు. గత టిడిపి హయాంలో పురుషోత్తపట్నం వద్ద చేపట్టిన లిఫ్ట్ ఇప్పుడు పూర్తిగా మూతబడింది. చాగల్నాడు ఎత్తిపోతల, పుష్కర ఎత్తిపోతల పథకాలున్నా మోటార్లు పనిచేయకపోవడంతో అవి ఉత్సవ విగ్రహాలుగానే మిగిలాయి. చాగల్నాడుకు సంబంధించి మూడు మోటార్లు పూర్తిగా పాడవ్వడంతో ఒక్కమోటారు ద్వారానే సాగునీటి సరఫరా జరిగింది. సుబ్బారాయుడు సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తిగా అటకెక్కింది. ఇక పుష్కర కాలువల పరిస్థితి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. పుష్కర అనుసంధాన కాలువలు పూర్తిగా పూడుకుపోయాయి. వీటిని పూడికతీత పనులు నిర్వహించిన దాఖలాలు ఎక్కడా లేవు.
రిజర్వాయర్లదీ అదే పరిస్థితి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజర్వాయర్ల పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు లేక రిజర్వాయర్లలో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. తాండవ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. తాండవ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 380 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వలు 353.01 అడుగులు వరకూ మాత్రమే నీరుంది. కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు చెందిన నాతవరం, కోటవరోట్ల, పాయకరావుపే, తుని, కోటనందూరు, రౌతులపూడి మండలాల రైతులు సాగునీరు ఎద్దడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో కాకినాడ జిల్లా కోటనందూరు మండల పరిధిలో 17 గ్రామపంచాయతీలో గత ఏడాది10,400 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఈ ఏడాది 9,542 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. పంపా రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏలేరు రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో ఇప్పటికే నీటి సరఫరా చాలా వరకూ ఆగిపోయింది. వర్షాలు సరిగా పడకపోతే ఈ ఏడాది సాగునీటి ఇక్కట్లు తప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే సాగునీటి సలహా మండలి సమావేశాల నిర్ణాయాలపై అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.