ప్రజాశక్తి- విఆర్.పురం
వైఎస్‌ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా గురువారం రేఖపల్లిలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో జరగనున్న ఆసరా కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం ఎంపిటిసి, సర్పంచ్‌లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో బుధవారం సిపిఎం ప్రజానిధుల సమావేశం జరిగింది. బోయ, వాల్మీకి, బెంతు ఒడియాలను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపి ఆదివాసీ ద్రోహిగా నిలిచిన ఎమ్మెల్యే ధనలక్ష్మి వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అందువల్ల ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి కారం లక్ష్మి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానానికి ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఆమోదం తెలిపారని, వారిలో రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నుండి గెలిచిన ఆదివాసీ ప్రజా ప్రతినిధులు కూడా హాజరు కాకుండా బహిష్కరించి తమ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ కార్యక్రమంలో అధికార పార్టీ ఆదివాసీ ప్రజా ప్రతినిధులు పాల్గొంటే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆదివాసీల పట్ల ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, జిఒ 52ను రద్దు చేయడానికి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం ఎంపిటిసి పునెం ప్రదీప్ కుమార్, శ్రీరామగిరి, చిన్నమట్టపల్లి, రేఖపల్లి, రామవరం, ములకనపల్లి సర్పంచ్‌లు పులి సంతోష్ కుమార్, వెట్టి లక్ష్మి, పూనెం సరోజిని, కారం బుచ్చమ్మ, సవలం మారయ్య, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు పాల్గొన్నారు.










