Jan 23,2021 06:39

భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు వున్నా దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్‌ చంద్రబోస్‌ ఒక్కరే. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వాన్ని ధిక్కరించి నిలదొక్కుకున్న నేత ఆయన. బ్రిటిష్‌ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఐసిఎస్‌ చదివి కూడా అన్నీ వదులుకుని స్వాతంత్య్ర పోరాటంలో దూకారు. గాంధీజీ విధానాలతో విభేదించి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయనకు కమ్యూనిస్టులు ఇతర అభ్యుదయ వాదుల మద్దతు లభించడం అందుకు కారణమైంది. అయితే ఆ విజయం తర్వాత ఆగ్రహించిన గాంధీజీ కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించడంతో సుభాస్‌ చంద్ర బోస్‌ రాజీనామా చేసి బయట పడ్డారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్థాపించారు. 1940లలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీకి బ్రిటన్‌ శత్రు దేశం గనక ఆ దేశం సహాయంతో భారత దేశాన్ని విముక్తి చేయొచ్చని ఒక అవాస్తవమైన ఆలోచన చేసి హిట్లర్‌తో చేతులు కలిపారు. నక్క జిత్తులకు మారుపేరైన నాజీ హిట్లర్‌ తన దగ్గరున్న భారతీయ ఖైదీలను బోసుకు అప్పగించారు. వారితో రెండవ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఎ) ఏర్పడింది. అంతకు ముందే జపాన్‌ సహాయంతో ఏర్పడిన మొదటి ఐఎన్‌ఎ కొంత నీరసపడి వుంటే దానికి కొత్త ప్రాణం పోశారు. ఇంకా అనేక మంది దేశభక్తులను చేర్చుకున్నారు. ఆగేయాసియా లోని సింగపూర్‌లో స్థావరం ఏర్పాటు చేసుకుని బ్రిటన్‌పై పోరాడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో 1945 ఆగష్టు18న విమానంలో బయలుదేరిన నేతాజీ పార్మోజా దీవి (ఇప్పటి తైవాన్‌)లో మరణించారు. జపాన్‌కు చెందిన తనోషీ యోషీమా నాయకత్వం లోని సైనిక వైద్య బృందం అన్ని పరీక్షలు జరిపి మరణించినట్టు ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని భద్రపర్చారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన మరణించలేదనీ, ఉత్తర ప్రదేశ్‌ దగ్గర సాధువు రూపంలో జీవించి వున్నారని అప్పట్లో ఒక వదంతి బయలుదేరింది. ఈ కథలు సజీవంగా వుంచేందుకు పాలక పక్షాలు చేయగలిగినంతా చేస్తూనే వస్తున్నాయి.


నేతాజీ సహాయకుడైన ఉత్తమచంద్‌ మల్హోత్రా ఆయనను గుర్తించాడని చెబుతుంటారు. ఆ సాధువు ఎప్పుడూ బయటకు వచ్చేవాడుకాదనీ, ఏదో నిగూఢంగా ప్రవర్తించేవాడని ఏవేవో కథనాలు...గాంధీజీ అంత్యక్రియలకు హాజరైనాడని మరో కథనం...ఇదంతా తెలిసి కూడా మొదటి ప్రధాని నెహ్రూ కావాలనే ఈ విషయంలో ఆసక్తి చూపకుండా తొక్కిపడుతున్నాడని ఆరోపణలు. తాను రష్యాలో వున్నాననీ తప్పించుకోవడానికి సహాయపడాలని నేతాజీ రాసిన లేఖకు కూడా నెహ్రూ స్పందించలేదనేంత వరకూ ఈ ఆరోపణలు వెళ్లాయి. దీనిపై నెహ్రూ ప్రభుత్వం 1956లో షా నవాజ్‌ కమిషన్‌ను నియమించింది. విస్త్రుతంగా విచారణలు జరిపిన మీదట ఆ కమిషన్‌ నేతాజీ మరణించాడని నిర్ధారించింది. తర్వాత కూడా ఈ ప్రచారాలు ఆగకపోవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970లో జస్టిస్‌ ఖోస్లా కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ కూడా అనేక మందిని విచారించి అనేక పర్యటనలు జరిపి నేతాజీ మరణించినట్టు నిర్ధారించింది. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంటు సభ్యుడైన సమర్‌ గుహా నేతాజీ బతికి వున్నట్టు ఒక చిత్రం విడుదల చేశారు. అది ఆయన సోదరుడైన శరత్‌ చంద్రబోసుదని బెంగాలీ పత్రికలు పోలికలతో సహా ప్రకటించాయి. ఆ తర్వాతి కాలంలో నేతాజీ చితాభస్మం తెప్పించి నదుల్లో విలీనం చేశారు. వాజ్‌పేయి నాయకత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2000లో జస్టిస్‌ ఎంఎస్‌ ముఖర్జీ కమిషన్‌ను నియమించినా వారు కూడా తేల్చిందేమీ లేకపోయింది. నరేంద్ర సిక్దర్‌ అనే పాత్రికేయుడు ఒక అఫిడవిట్‌ సమర్పించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ తొలి వ్యవస్థాపక బృందంలో ఒకరైన వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ కుమారుడు నిఖిల్‌ చటోపాధ్యాయ తను నేతాజీని రష్యాలో కలుసుకున్నానని తనతో చెప్పినట్టు ఆ అఫిడవిట్‌లో వుంది. మరి నేతాజీ ఇండియాకు ఎందుకు రాలేదంటే నెహ్రూకు భయపడటం వల్లనట. ఈ విషయం నెహ్రూ సన్నిహితుడైన కృష్ణమీనన్‌ కూ తెలుసట. అలాగే నేతాజీ యుద్ధ నేరస్తుడుగా రష్యాకు పట్టుకుపోయారని నెహ్రూ సంతకం లేని లేఖలో బ్రిటిష్‌ ప్రధాని అట్లీకి రాశారని మరో కథ. వినడానికే విడ్డూరంగా వుండే ఈ కబుర్లపై వాజ్‌పేయి ప్రభుత్వం కూడా స్పందించలేదు. వారు నియమించిన 'ముఖర్జీ కమిషన్‌'... నేతాజీ ఆ రోజున విమాన ప్రమాదంలో మరణించలేదని అయితే సరిగ్గా ఏం జరిగిందనేది చెప్పడానికి ఆధారాలు లేవని నివేదించింది. ఆయన మరణించాడనే భావిస్తున్నట్టు 2013లో ప్రభుత్వం మే 7న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. నేతాజీ సైన్యంలో పని చేసిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ కూడా ఆయన మరణించారనే చెప్పడం ఈ వ్యాసరచయిత చాలా సార్లు విన్నారు, అనువదించారు కూడా.


ఇంతజరిగిన తర్వాత మరోసారి నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ప్రమాద మరణంపై ఈ కథనాలకు సంబంధించిన 64 ఫైళ్లను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2015లో ఎన్నికల ముందు విడుదల చేశారు. ప్రధాని మోడీ కూడా ఫైళ్లు రోజుకు కొన్ని చొప్పున బయటపెట్టారు. నేతాజీ కుటుంబ సభ్యులను విందుకు పిలిచి మరీ కొన్ని ఫైళ్లు చేతిలో పెట్టారు. బెంగాల్‌ ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే కేంద్రరాష్ట్రాలు ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. ఇప్పుడు కూడా ఎన్నికల ముంగిట్లో అదే ప్రహసనం పునరావృతం అవుతున్నది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో మమతా బెనర్జీ కూడా నేతాజీ స్మరణ ఉధృతం చేశారు. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు వేసిన తెలివైన ఎత్తుగడగా పత్రికలు అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు. నేతాజీ బతికే వున్నాడన్న సందేహాన్ని వ్యక్తం చేసే బంధువుల లేఖలు, అమెరికా బ్రిటన్‌ గూఢచారి సంస్థల అనుమానాలు మాత్రమే ఈ ఫైళ్లలో వున్నాయి. ఈ ఫైళ్లను చూసిన తర్వాత కూడా నేతాజీ ప్రమాదంలో మరణించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపి అయిన నేతాజీ మేనకోడలు కృష్ణబోస్‌ అప్పట్లో వ్యాఖ్యానించారు. ప్రమాద వార్తల తర్వాత కూడా ఆయన బతికి వున్నాడని చెప్పే ఆధారాలు ఏవైనా చూపిస్తే అప్పుడు నమ్ముతానని ఆమె అన్నారు. వాస్తవానికి బతికి వున్నాడని అనుకున్నవారి లేఖలు కథనాలు మాత్రమే ఇందులో వున్నాయి తప్ప అందుకు ఆధారాలు లేనేలేవు. బ్యాంకాక్‌ నుంచి ఒక ప్రసార వ్యవస్థలో మాట్లాడాడని కొందరు రాస్తే - పెకింగ్‌ రేడియో నుంచి రోజూ నేతాజీ మాట్లాడతాడని సాయంత్రం ఒక వాక్యం వినిపించేదని ఆయన బంధువు శిశిర్‌ బోస్‌ అప్పట్లో చెప్పారు. 1949లో బ్లిట్జ్‌ పత్రిక ఆయన బతికేవున్నట్టు అనుమానం వెలిబుచ్చుతూ ప్రచురించిన కథనం మరొకటి. నిజానికి బ్లిట్జ్‌ వారపత్రిక ఆ రోజుల్లో నిరాధార సంచలనాలకు పెట్టింది పేరు. తనకు నిర్దిష్టమైన ఆధారాలేమీ దొరకలేదని కూడా బ్లిట్జ్‌ నివేదికలో వుంది. కనుక మొత్తంపైన ఇవన్నీ కథనాలు, ఊహాగానాలే. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇదమిద్దంగా ఫలానా వారు ఆయనను చూసినట్టు లేదా ఫలానా చోట వున్నట్టు చెప్పేవి కావు. కనుకనే 12 వేల పేజీలకు పైగా వున్న 64 ఫైళ్లను విడుదల చేసిన తర్వాత కూడా నూతన సమాచారం శూన్యం.


కాని ఈ ఫైళ్ల విడుదలతో మళ్లీ కథలు ఊపందుకున్నాయి. నేతాజీ 1968లో బతికే వున్నాడని చాలా పత్రికలు 2016లో పెద్ద శీర్షికలు ఇచ్చాయి. ఈసారి స్టాలిన్‌ను తీసుకొచ్చారు. కొన్ని ఇంగ్లీషు పత్రికలు రాసిన కథనాల్లో నేతాజీ సహాయకుడైన సత్యనారాయణ్‌ సిన్హాతో మరెవరో ఆయనను చూసినట్టు చెప్పారని వుంది. సారాంశం చెప్పుకోవాలంటే విమాన ప్రమాదం తర్వాత సోవియట్‌ ప్రభుత్వం నేతాజీని సైబీరియాలో ఒక ఖైదులో వుంచిందట. అది కూడా ప్రపంచంలో అతి శీతలమైన యాకుత్సు లో 45వ జైలు గదిలో స్టాలిన్‌ ఆయనను బంధించాడట. అక్కడ ఆయనను చూసినట్టు కోజ్లోవ్‌ అనే గూఢచారి తనకు చెప్పాడని డా||సత్యనారాయణ సిన్హా అనే మాజీ ఎంపి ఖోస్లా కమిషన్‌కు చెప్పినా దానికి తగిన విలువ ఇవ్వకుండా దాటేశారట. ఈ సిన్హా ఆ రోజుల్లో ఎలాగో సోవియట్‌లో ప్రవేశించి వారి సైన్యంలో పని చేసిన సందర్భంలో ఇదంతా జరిగిందనేది కథనం. ఈ సిన్హా నెహ్రూ తరపున అంతర్జాతీయ బృందాలలో పనిచేసేవాడు. ఈ విషయాలు తాను నెహ్రూకు చెబితే పెద్ద విలువ ఇవ్వలేదనీ అంతా అమెరికా ప్రచారమై వుంటుందని తోసిపారేశాడనీ సిన్హా ఖోస్లా కమిషన్‌కు చెప్పాడు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు నేతాజీ సంబంధం పెట్టుకున్న జర్మనీ జపాన్‌ గాక నాటి సోవియట్‌ యూనియన్‌ను దాని అధినేత స్టాలిన్‌ను ఈ వ్యవహారంలో దోషిగా చూపించే ప్రయత్నం కుత్సితమైంది. ఆనాడు ప్రపంచంలో తిరుగులేని నాయకుడుగా వున్న స్టాలిన్‌కు నేతాజీ వంటి అనధికార నేత పట్ల అంత ఆసక్తి ప్రదర్శించే అవసరమే వుండదు. పైగా ఆ రోజుల్లో సోవియట్‌ యూనియన్‌ కు నెహ్రూ ప్రభుత్వం పట్ల పెద్ద సదభిప్రాయం లేదు. అప్పటికింకా ఆ ప్రభుత్వం బ్రిటిష్‌ అనుకూల విధానాలను అనుసరిస్తుండడమే అందుకు కారణం. ఈ వ్యవహారం లోకి చైనాను కూడా లాగి ఉత్తుత్తి ప్రమాదం తర్వాత ఆయన చైనా వెళ్లారని, మావో నడిపించిన విప్లవ పోరాటంలో పాల్గొన్నారని సరికొత్త ఊహాగానాలు సృష్టించారు. వినడానికి ఎంత ఆసక్తి, కుతూహలం కలిగించినా నేతాజీ మరణానికి సంబంధించిన ఇవన్నీ కథలు మాత్రమే. విమర్శనాత్మకంగా చూడక తప్పదు. నేతాజీ మనవడు, కృష్ణబోస్‌ కుమారుడు, తృణమూల్‌ ఎం.పి సౌగత్‌ రారు...నేతాజీ మరణించాడనే గట్టిగా నమ్మడమే గాక ఈ పునర్విచారణ తతంగాలన్నిటినీ ఖండిస్తున్నారు. ఇది చాలా తక్షణ సమస్య గనక వెంటనే విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే వాస్తవ పరిస్థితి అర్ధమవుతుంది. నెహ్రూ ప్రభుత్వం నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టిందనే ఒక వాస్తవం దీనిలో కనిపిస్తుంది. అది మాత్రం పొరబాటు కావచ్చు. టోక్యో లోని ఒక గుడిలో నేతాజీ చితాభస్మం వున్నట్టు జపాన్‌ ప్రభుత్వం రాసినా నెహ్రూ స్పందించలేదని మరో ఆరోపణ. మరణం నిర్ధారణ అయ్యేవరకూ దాన్ని తెప్పించవద్దని ఆయన భావించి వుంటారు తప్ప బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ నెహ్రూ వ్యతిరేక ప్రచారానికి ఇదో సాధనంగా చేసుకోవడం అర్థరహితం.


ఈ కట్టుకథలన్నీ వాతావరణం కలుషితం చేస్తున్నాయి గనకనే 1997లో నేతాజీ శత జయంతి సందర్భంలోనే వామపక్ష ప్రభుత్వ హయాంలో బెంగాల్‌ శాసనసభ ఈ ఫైళ్లను బయట పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది. హిట్లర్‌తో చేతులు కలపడం సరికాదని ఆ రోజుల్లో నేతాజీని విమర్శించినప్పటికీ ఆయన దేశభక్తి పట్ల కమ్యూనిస్టులకు పూర్తి గౌరవం వుంది. కాని తర్వాత కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వాలు అందుకు స్పందించలేదు. వామపక్ష ప్రభుత్వం ప్రతి ఏటా ఆయన సంస్మరణ సభ నిర్వహించేది కూడా. ఆయనపై వున్న గౌరవాన్ని కట్టుకథలనూ వేరు వేరుగా చూడవలసి వుంటుంది. ప్రత్యక్షంగా జరిగిన గాంధీజీ హత్య కేసులో గాడ్సేను సమర్థిస్తున్న వారు ఈ విధంగా నేతాజీ విషయంలో లేనిపోని రభస సృష్టించడం, అటు నెహ్రూపై ఇటు కమ్యూనిస్టులపై కుట్ర ఆరోపణలు చేయడం చూస్తుంటే దీనికి సంఘ పరివార్‌ భావజాలానికి బంధం సుస్పష్టం. నెమ్మదిగా నెహ్రూ గాంధీ వారసత్వాన్నితగ్గించి తమ నాయకులతో నింపాలన్నది బిజెపి ఆలోచన కాగా బెంగాల్‌ ఎన్నికలలో ఉపయోగించుకోవాలన్నది మమత వ్యూహంలో మతలబు. ఇప్పుడు 125వ జయంతి అందుకు మరోసారి కలసివచ్చినట్టు కనిపిస్తుంది గాని కొత్తగా తెలిసివచ్చేది మాత్రం ఏమీ వుండదు. బహుశా పదే పదే ఈ హడావుడి అలవాటైన బెంగాలీలు ఇతర భారతీయులు కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని నేతాజీ ఘన వారసత్వాన్ని కాపాడుకోవడం దేశ భక్తుల బాధ్యత.
                                                                                                        * తెలకపల్లి రవి