Jul 04,2021 11:17

కొద్దిగా వగరు, కొద్దిగా తీపి కలిసిన మృదువైన నేరేడు పండ్లు తినడానికి చాలా బాగుంటాయి. అంతేనా! వాటితో రకరకాల వెరైటీలు చేసుకుని తింటే వారెవ్వా! అనకుండా ఉండలేరు. ఇంకెందుకాలస్యం అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

                                                                                   పచ్చడి

 పచ్చడి

కావాల్సిన పదార్థాలు : నేరేడు పండ్లు - పది, కారం - పావు టీస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - సరిపడా, నూనె, ఆవాలు - ఒక్కొక్కటీ ఒక్కో స్పూను, మెంతులు, చక్కెర - ఒక్కొక్కటీ ఒక్కో పావు టీస్పూను, పసుపు - చిటికెడు, కరివేపాకు - గుప్పెడు.
 

తయారుచేసే విధానం :
ముందుగా నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించి, ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో ఆవాలు, మెంతులు వేసి వేగించాలి.
అవి వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు వేయాలి.
అందులోనే నేరేడు ముక్కలు, పసుపు, ఉప్పు వేయాలి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
అందులో కారం, చక్కెర వేసి కలిపిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. పాన్‌పై మూతపెట్టి, మూడు నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత దీన్ని బౌల్‌లోకి తీసి సర్వ్‌ చేసుకోవాలి.

                                                                                   సూప్‌

  సూప్‌

కావాల్సిన పదార్థాలు :
నేరేడు పండ్లు- 10 లేదా 12, ఉప్పు- తగినంత, నిమ్మరసం - కొంచెం.

తయారుచేసే విధానం :
ముందుగా తాజా నేరేడు పండ్లను గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి.
అవి బాగా నానిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
తర్వాత నేరేడు పండ్లలోని గింజలను తొలగించి గుజ్జు చేసుకోవాలి. దానిని జల్లెడ పట్టాలి.
అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది.
అందులో కొంచెం ఉప్పు కలిపి, ఒక పొంగు వచ్చే వరకూ స్టౌమీద ఉంచి దింపేయాలి.
తర్వాత దానిలో నిమ్మరసం కలిపి, తీసుకుంటే సరిపోతుంది.
ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి చాలా మంచిది.

                                                                                           స్లష్‌

 స్లష్‌

కావాల్సిన పదార్థాలు :
నేరేడు పండ్లు- 10 లేదా 12 (విత్తనం తీసినవి), నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌- 8 లేదా 10 (నిమ్మకాయ, నీళ్లు, ఉప్పు, చక్కెరను కలిపి ఐస్‌ ట్రేలో పెట్టి, డీఫ్రిజ్‌లో ఉంచాలి. కొంత సమయం తర్వాత తయారయ్యేవే నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌)
 

తయారుచేసే విధానం :
ముందుగా నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించాలి. తర్వాత నేరేడు పండ్లను ముక్కలుగా తరుక్కోవాలి.
డీ ఫ్రిజ్‌లో ఉన్న నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌ను బౌల్‌లోకి తీసుకోవాలి.
నేరేడు ముక్కలను మిక్సీలో వేసుకోవాలి.
అందులోనే నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌ను వేసి, చేతితో అటూఇటూ బాగా తిప్పి, మిక్సీ పట్టాలి.
మరలా ఒకసారి మిక్సీజార్‌లో చేతితో అటూఇటూ తిప్పి, మరోసారి మిక్సీ పట్టాలి.
దానిని ఒక గాజు గ్లాసులోకి తీసుకుని, పైన పుదీనాతో గార్నిష్‌ చేయాలి.
దీనిలో కొంచెం ఐస్‌ వేసుకుని డ్రింక్‌లాగా తాగవచ్చు. లేదా స్పూన్‌తో తినవచ్చు. ఎలా చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.

                                                                                     రైతా

  రైతా

కావాల్సిన పదార్థాలు :  పెరుగు- కప్పు, నేరేడు పండ్లు- అరకప్పు (విత్తనం తీసినవి), ఉప్పు- తగినంత, జీలకర్ర- అర టేబుల్‌స్పూను, కొత్తిమీర- టేబుల్‌స్పూను.
తయారుచేసే విధానం :
ముందుగా పెరుగును బౌల్‌లోకి తీసుకోవాలి.
నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించాలి. తర్వాత నేరేడు పండ్లను ముక్కలుగా చేసుకోవాలి.
వాటిని పెరుగులో కలుపుకోవాలి.
అందులోనే ఉప్పు, జీలకర్ర, కొత్తిమీరను వేయాలి.
వాటన్నింటినీ స్పూనుతో బాగా కలపాలి. అంతే రైతా రెడీ.
కొంత సమయం ఫ్రిజ్‌లో పెట్టి, సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.
కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది.
ఇది కిచిడీకి మంచి కాంబినేషన్‌.