Jun 14,2023 23:38

ప్రజాశక్తి-గుంటూరు : నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరుగుతున్న కుమార్‌ సురేంద్రసింగ్‌ మెమోరియల్‌ నేషనల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్‌ 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు. 60 షాట్స్‌కు 600 పాయింట్స్‌కు గాను ముకేష్‌ 567 పాయింట్స్‌ సాధించాడు. ఇండియన్‌ ఆర్మీకి చెందిన ప్రద్యుమ్నసింగ్‌ 566 పాయింట్లతో రజత పతకం గెలవగా, మహారాష్ట్రకు చెందిన రాజ్‌వర్థన్‌ అషుతోష్‌ పాటిల్‌ 559 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేస్తున్న వారిలో కెఎల్‌ యూనివర్సిటీలో బి.టెక్‌ 2వ సంవత్సరం చదువుతున్న ముఖేష్‌కు చాంపియన్‌షిప్‌లో ఇది 4వ పతకం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తొట్టెంపూడి సలలిత్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, కెఎల్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ డీన్‌ హరికిషోర్‌, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు.