Feb 14,2021 10:40

   దేశమంటే మనుషులని మీరంటారు! కానేకాదు.. ఇది ఒక మతానికి చెందిన వారిదేనని దబాయిస్తూ తక్కిన వారికి ఇక్కడ చోటులేనే లేదంటుంటారు. వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు.. మతం వేరైనంత మాత్రాన పరాయివారైపోతారా అని అడిగితే అడిగిన వారిని 'దేశద్రోహి' అంటారు. దొంగ సాక్ష్యాలను సృష్టించి, జైళ్ళలో నిర్బంధిస్తారు. దీనిని సమర్ధించుకోవడానికి వారికి దబాయింపు కావాలి! ఎదుటివారి వాక్స్వాతంత్య్రాన్ని నిలువునా కబళిస్తూ, మాట్లాడటానికీ అవకాశమివ్వకుండా, 'నేషన్‌ వాంట్స్‌ టు న్నో..' అంటూ విరుచుకుపడే ఆ దబాయింపు పేరు అర్నబ్‌ గోస్వామి! సంఫ్‌ుపరివార్‌ నయవంచక అజెండానే జర్నలిజంగా మార్చి మోడీ అండ్‌ కోకు బాకాగా మారి దేశాన్ని, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిన అర్ణబ్‌ ఇప్పుడు బోనులో నిలబడ్డారు. తనతో పాటు తన వెనుక ఉన్న శక్తులనూ నిలబెట్టారు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ ఎలా తయారైంది? ఎలా ముందుకు నడిచింది? ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించారు? తిమ్మిని బమ్మిని చేసే అర్ణబ్‌లను ఎందరిని సంఫ్‌ుపరివార్‌ సృష్టించింది ? నేషన్‌ వాంట్స్‌ టు న్నో!! ఇదే అట్టమీది కథనం.

                                     

                                                                వాట్సాప్‌తో ఇరుకున..

వాట్సాప్‌తో ఇరుకున..

 

    నిజానికి 2020 జులై వరకు అర్ణబ్‌ గోస్వామి ప్రాభవానికి ఎదురులేదు. ఇతరులకు దుర్లభమైన ప్రధానమంత్రి ఇంటర్యూలు కూడా అతనికి సులభంగా దొరికేవి. పిఎంఓ కార్యాలయంలోకి ఎటువంటి తనిఖీలు లేకుండానే నేరుగా వెళ్లగలిగేవాడని సమాచారం. ఇంతటి అనుబంధం ఉంది కాబట్టే 'టైమ్స్‌ నౌ' ఛానల్‌ నుండి బయటకు వచ్చిన తరువాత బిజెపి నేతల పెట్టుబడితో ప్రారంభమైన 'రిపబ్లిక్‌ టివి'లో చేరాడు. ఆయన చేరడం, ఆ ఛానల్‌ గ్రాఫ్‌ అలా పైపైకి దూసుకుపోవడం ఒకేసారి జరిగింది. ఇదంతా అర్ణబ్‌ ఘనతే అంటూ ప్రచారమూ జరిగింది. అయితే, ఇది వాపే గానీ బలం కాదని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలు ఎదురుతిరిగాయి. టిఆర్‌పి రేటింగ్‌ల కోసమే ఇదంతా చేస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రియా ఆత్మహత్యాయత్నం చేయడంతో దానికి సంబంధించిన కేసులో అర్ణబ్‌ జైలుకు వెళ్లక తప్పని స్థితి నెలకొంది. ఈ క్రమంలో వెలుగుచూసిన వాస్తవాలు అర్ణబ్‌కు కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత నాయకత్వానికి ఉన్న సంబంధాలను బట్టబయలు చేశాయి.

    దేశం ఎవరిది..? కార్మిక, కర్షకులది. ఉధృతంగా సాగుతున్న రైతు ఉద్యమం ఇచ్చిన సమాధానం ఇది. దీనర్థం స్పష్టం. కులమతాలకు అతీతంగా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ దేశం చెందుతుంది. కానీ, దీనిని కొందరు అంగీకరించరు. వారి దృష్టిలో ఈ దేశం కొందరిదే. మిగిలిన వారికి ఈ దేశంపై ఎటువంటి హక్కూ లేదని, ఇక్కడ బతికినా రెండవ తరగతి పౌరులుగా బతకాలని వాదిస్తారు. ఈ వాదనకు ఎటువంటి లాజిక్కూ ఉండదు. లేదన్న సంగతి వారికీ తెలుసు. అందుకే వారికి దబాయింపు కావాలి.
మీరేం తింటున్నారు..? ఏం తినాలన్నది వ్యక్తిగతం. ఎవరికి నచ్చింది వారు తింటారు. కానీ, ఈ సమాధానాన్ని వారు అంగీకరించరు. మీరేం తినాలో వారే చెబుతారు. మీరు ఏం తింటున్నారో తనిఖీ చేయడానికి మీ వంటింట్లోకి తొంగి చూస్తామంటారు. దీనికీ లాజిక్కు ఉండదు. అందుకే దబాయింపు కావాలి.


                                                           ఉలిక్కిపడిన మీడియా..

ఉలిక్కిపడిన మీడియా..

     రిపబ్లిక్‌ టివీలో.. అంతకు ముందు మరో ఛానల్లో.. దేశమంటే తనే అన్నంత బిల్డప్‌ ఇస్తూ 'నేషన్‌ వాంట్స్‌ టు న్నో' అంటూ అంతెత్తు గొంతుతో అరిచే ఆ వ్యక్తిని చూసే ఉంటారు కదూ! చూడకపోయినా వినే ఉంటారులెండి! టిఆర్‌పి రేటింగ్‌లలో చేసిన అక్రమాలతో మీడియా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత వెలుగులోకి వచ్చింది.. 2019లో జరిగిన బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ జరుగుతుందన్న సమాచారం అర్ణబ్‌కు ముందే ఉందని. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు విషయమూ ఆయనకు ముందుగానే తెలసంటూ సాక్ష్యాధారాలతో సహా వచ్చిన వార్తా కథనాలు. ఇవన్నీ ఆయన్ను తెలియని వారికీ తెలియజేశాయి. ఈ వ్యవహారాలు మోడీ అండ్‌ కో కు ఆయన ఎంత సన్నిహితుడో దేశ ప్రజల ముందు బట్టబయలు చేశాయి. అంతేకాదు, ఈ అనుబంధం దేశ భద్రతకు ఎంత ప్రమాదకరంగా మారిందో కూడా స్పష్టమైంది. మొట్టమొదట ముంబయి టిఆర్‌పి రేటింగ్‌ల్లో జరిగిన అక్రమాలు, అర్నాబ్‌ పాత్ర వెలుగులోకి వచ్చినప్పుడు ఏదో ఒక పేరుతో అర్ణబ్‌ను వెనకేసుకు రావడానికి కొందరు బిజెపి నేతలు ప్రయత్నించారు. కానీ, ఒకదాని తరువాత ఒకటిగా బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలు చర్చనీయాంశం కావడంతో 'అర్ణబ్‌' గురించి మాట్లాడవద్దు అంటూ 'పై' నుండి ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో వారు ముఖం చాటేస్తున్నారు. తన షోకు వచ్చిన ఇతరులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం అతని అలవాటు. ఇప్పుడు అదే స్థితి అతనికి ఎదురైంది. ప్రస్తుతం అత్యున్నత నాయకత్వ స్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు అతనికి మద్దతిస్తున్నారు. ఈ కారణంగా కేసుల నుండి అతి కష్టం మీద బయటపడితే పడవచ్చుగాక.. కానీ అతని విశ్వసనీయత మాత్రం ఘోరంగా దెబ్బతింది.
 

                                               వెయ్యి పేజీలు.. ప్రారంభం మాత్రమే !

    కేసు విచారణలో భాగంగా ముంబయి పోలీసులు దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ పెద్ద కలకలం రేపింది. వెయ్యి పేజీలలో ఉన్న ఈ ఛార్జిషీట్‌ను తమ పరిశోధనలో కొంతభాగమేనని పోలీసులు కోర్టుకు తెలపడం విశేషం. వీటిలో పోలీసులు దాఖలు చేసిన వాట్సాప్‌ సంబాషణలు పెద్ద దుమారాన్నే రేపాయి. రేటింగ్‌ ఏజెన్సీ (బార్క్‌) ఎగ్జిక్యూటివ్‌ పార్థోదాస్‌ గుప్తాతో అర్ణబ్‌ జరిపిన సంబాషణలు రిపబ్లిక్‌ టివి టిఆర్‌పి రేటింగ్‌ల్లో ఎలా దూసుకువెళ్లిందో, దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కారో వివరించాయి. దీనికన్నా దిగ్భ్రాంతి కలిగించే అంశమేమిటంటే దేశభద్రతకు సంబంధించిన అతి సున్నితమైన అంశాలూ వీరి సంభాషణల్లో అలవోకగా చోటుచేసుకోవడం. ఈ రెండో అంశమే ఇప్పుడు కీలకంగా మారింది. సంఫ్‌ుపరివార్‌ను, దాని కన్నుసన్నల్లో నడిచే బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది.

                                                           ఎందరు అర్ణబ్‌లు...?

ఎందరు అర్ణబ్‌లు...?

   తిమ్మిని బమ్మిని చేసే ఈ తరహా అర్ణబ్‌లను సంఫ్‌పరివార్‌ ఎందరిని సృష్టించి దేశం మీదకు వదిలింది? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే! సోషల్‌ మీడియాలో దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆ సంస్థ పోషిస్తోంది. వీరి పని అవాస్తవాలను ప్రచారం చేయడమే కాదు.. సృష్టించడం కూడా! ఒక అబద్ధాన్ని సృష్టించి, దానిని ప్రచారంలోకి తెచ్చి.. ప్రజలంతా దానినే నిజమని నమ్మేలా ప్రచారం చేయడం. సంఫ్‌ుపరివార్‌ శత్రువులను దేశద్రోహలుగా చిత్రీకరించడం వీరి పని. బీమా కొరెగావ్‌ కేసులో వెలుగులోకి వస్తున్న పరిణామాలు ఈ తరహా కుట్రలకు తాజా ఉదాహరణ మాత్రమే. పౌరహక్కుల నేతల కంప్యూటర్లలోకి చొరబడి, వాటిని హ్యాక్‌ చేసి, ఫ్యాబ్రికేటెడ్‌ ఆధారాలను సృష్టించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించి, దేశద్రోహులుగా ముద్ర వేశారు. ఈ అవసరం ఎవరికి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. సోషల్‌ మీడియాలోనే కాదు.. ప్రధాన స్రవంతి మీడియాలోనూ అన్ని రాష్ట్రాల్లో.. అన్ని భాషల్లో ఈ తరహా అర్ణబ్‌లు ఉన్నారు. వీరేం చేస్తున్నారు? దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు? వీరి తర్వాత టార్గెట్‌ ఎవరు? నేషన్‌ వాంట్స్‌ టు న్నో! ఆ గుట్టు రట్టు అయ్యేంతవరకూ పారాహుషార్‌ !!

పొగడదొరువు
7382168168

 

                                                 ఆ సంభాషణలేమిటో చూద్దాం..

  గత ఎన్నికల్లో బిజెపి అట్టహాసంగా ప్రచారం చేసుకున్న బాలాకోట్‌ మెరుపుదాడుల గురించి ప్రస్తావన కూడా ఈ సంభాషణల్లో ఉంది. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన దాడిలో 44 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 26న భారతసైన్యం పాకిస్తాన్‌లోని బాలకోట్‌ ప్రాంతంలో సర్జికల్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ చేసింది. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సర్జికల్‌ స్ట్రైక్‌తో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పామని భారత్‌ ప్రకటించింది. 'అత్యంత రహస్యంగా.. మూడో కంటికి తెలియనీయకుండా' అంటూ మనదేశ అత్యున్నత యంత్రాంగం ప్రకటించగా, దానికి భిన్నంగా ఫిబ్రవరి 23నే అర్ణబ్‌ ఆ దిశలో పార్థోదాస్‌ గుప్తాకు వాట్సాప్‌లో సంకేతాలు ఎలా ఇచ్చారో చూడండి! న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జిషీట్‌లో 108వ పేజీలో ఈ విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు.
'ఈ సారి చాలా పెద్దది జరగబోతోంది..!' ఇది అర్ణబ్‌ నుండి వచ్చిన సందేశం.
'దావూదా...?' పార్థోదాస్‌ గుప్తా సందేహం.
'కాదు సార్‌.. పాకిస్తాన్‌. చాలా పెద్దదే జరగబోతోంది'
'దాడా..?'
'మాములు దాడి కన్నా చాలా పెద్దది'!
ఈ సమాధానం చాలు కదా అక్కడేం జరుగబోతోందో అర్ణబ్‌కు ముందే తెలుసని చెప్పడానికి! మరి గోప్యత ఎక్కడీ దేశ భద్రత ఎక్కడీ ఇది దేశద్రోహం కాదా? ద్రోహమే అయితే చేసింది ఎవరు? ఏ స్థాయిలోని వ్యక్తులు? ఈ ప్రశ్నలే మోడీ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఇరుకున పెడుతున్నాయి.


                                                   ఆర్టికల్‌ 370 రద్దుపై ఇలా...

ఆర్టికల్‌ 370 రద్దుపై ఇలా...

    2019 ఆగస్టులో జరిగిన ఈ వాట్సాప్‌ సంభాషణ చూడండి.
'ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తారంటున్నారు.. నిజమేనా?' గుప్తా అడిగిన ప్రశ్న.
'బ్రేకింగ్‌ వార్తలు ఇవ్వడంలో నేను కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేశాను. ఆ స్టోరీ మనది. మనమే బ్రేక్‌ చేస్తాం' అర్నాబ్‌ సమాధానం.
కొంత విరామం తరువాత 'సోమవారం ఎన్‌ఎస్‌ఎ (నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ), పిఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం)లను కలుస్తాను.
ఆ వార్తను బ్రేక్‌ చేసిన తరువాత, గోస్వామి గుప్తాకు 'ఎన్‌ఎస్‌ఎ, పిఎంఓలలోని ప్రతి ఒక్కరూ రిపబ్లిక్‌ ఛానల్‌కు అతుక్కుపోయారు. అది పెద్ద సంచలనం అయ్యింది. శ్రీనగర్‌ వెళ్లడానికి ముందు ధోవల్‌ నన్ను కలిశాడు. దీనిని వాళ్లు కచ్చితంగా ముందుకు తెస్తారు' అని మెసేజ్‌ పెట్టాడు.
పార్థోదాస్‌ గుప్తాకు హామీలు ఇలా...
టైమ్స్‌ గ్రూపులో ఒకప్పుడు తన సహచరుడు, ప్రస్తుతం రేటింగ్‌ ఏజెన్సీ (బార్క్‌)లో కీలకంగా ఉన్న పార్థోదాస్‌ గుప్తాకు అర్ణబ్‌ ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి.
'బార్క్‌ బోర్డులో ఎవ్వరూ వార్తలను అర్థం చేసుకోరు. వాటి ప్రాధాన్యతలను పట్టించుకోరు. వీరికసలు అవగాహనే లేదు. ఒంటరి యుద్ధం చేస్తున్నాను!' పార్థోదాస్‌ గుప్తా.
'ఆందోళన పడకండి. నేను మీతో ఉన్నాను. అందరితో మాట్లాడతాను. మద్దతు కూడగడతాను.' కొంత విరామం తరువాత 'నేను ప్రభుత్వంతో మాట్లాడతాను.'
ఆగస్టు 11, 2017న జరిగిన ఈ సంభాషణ చూడండి. అప్పటి సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంభాషణ జరిగింది.
గుప్తా : మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి కొన్ని అంశాలు ఆమెతో ప్రస్తావించండి.
అర్ణబ్‌ : తప్పకుండా.. నేను మాట్లాడతాను.
గుప్తా : ల్యాండింగ్‌ పేజీలు (టెలివిజన్‌ ఆన్‌ చేయగానే కనిపించే మొదటి స్క్రీన్‌) గురించి మాట్లాడండి. ఇది చాలా ముఖ్యం.
అర్ణబ్‌ : అలాగే..ఇంకేమైనా మాట్లాడాలా..?
గుప్తా : ఛానళ్ల చొరబాటు గురించి కూడా మాట్లాడండి. దానిని అరికట్టే అధికారాలు లేకుండా బార్క్‌ను పనిచేయమంటే ఎలా..?
అర్ణబ్‌ : అవును.. ఇది చాలా ముఖ్యం. నేను చేయిస్తా..! నేను 'వాళ్ల' మనిషినే!
అర్ణబ్‌ సంభాషణల్లో బాలకోట్‌, బిసిసిఐ, సమాచార మంత్రిత్వశాఖ, పిఎంఓ, రక్షణశాఖలతో పాటు అనేకమంది కేంద్ర మంత్రుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలు అలవోకగా దొర్లేవి! ఈ పేర్లు ఉపయోగించిన ప్రతిసందర్భంలోనూ తాను వాళ్ల సొంత మనిషినే అనే విధంగా అర్ణబ్‌ సంకేతాలను ఇచ్చేవారు.

article

 

                                                        అర్ణబ్‌-ది న్యూస్‌ ప్రాస్టిట్యూట్‌
                                                           

                                                                రామ్‌గోపాల్‌ వర్మ

రామ్‌గోపాల్‌ వర్మ

      అర్ణబ్‌ గోస్వామి తన డిబేట్‌ షోలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మతికి సంబంధించి బాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని చీకటి రహస్యాలు బయటపడాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్‌ను 'డర్టీ' అని సంబోధించారు. అండర్‌ వరల్డ్‌తో బాలీవుడ్‌కు సంబంధాలున్నాయని అన్నారు. దివ్యభారతి మతి మొదలుకొని జియాఖాన్‌, శ్రీదేవి, సుశాంత్‌ వరకు బాలీవుడ్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అర్ణబ్‌ చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ణబ్‌పై ట్విట్టర్‌ వేదికగా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

    బాలీవుడ్‌పై అర్ణబ్‌ గోస్వామి ఇంత దారుణంగా మాట్లాడటం చూసి షాక్‌ అయ్యాను. ఇది డర్టీ ఇండిస్టీ అని, క్రిమినల్‌ కనెక్షన్స్‌ ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగస్టర్స్‌, కామ పిశాచాలతో ఈ ఇండిస్టీ నిండిపోయిందని అర్ణబ్‌ అంటున్నారు. దివ్యభారతి, జియాఖాన్‌, శ్రీదేవి, సుశాంత్‌ మరణాలు ఒకే రకమైనవని అర్ణబ్‌ గోస్వామి గుడ్డిగా కంబైన్‌ చేసి చెప్పడం.. ఈ మరణాలకు బాలీవుడ్‌ కారణం అని చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఈ నాలుగు మరణాలు గడిచిన 25 ఏళ్లలో జరిగినవి. ఈ నాలుగు కేసులు పూర్తిగా విరుద్ధమైనవి, వేర్వేరు సందర్భాల్లో జరిగినవి. కానీ, అర్ణబ్‌ మనసు మాత్రం ఈ నాలుగూ ఒకటేనని చెబుతోంది. వీరందరినీ బాలీవుడ్‌ చంపేసిందని అంటోంది.

   బాలీవుడ్‌ ఏమైనా విలే పార్లే శ్మశానంలో నిద్రపోతున్న దెయ్యమా? రక్తదాహంతో ఉన్పప్పుడల్లా ఇది డ్రాకులాలా మారిపోయి బయటికి వచ్చి చంపేస్తోందా?. అర్ణబ్‌ గోస్వామి మొరుగుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్‌ జోహార్‌, మహేష్‌ భట్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ సహా ఇతర బాలీవుడ్‌ స్టార్లు ఎందుకు భయపడుతున్నారు? ఆఫీసుల్లో బల్లల కింద ఎందుకు దాక్కుంటున్నారో అర్థం కావడం లేదు. వీరంతా మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుంది. కనీసం ఇప్పటికైనా సినిమా ఇండిస్టీలోని ప్రముఖులు బయటికి వచ్చి అర్ణబ్‌ గోస్వామి తప్పుడు ప్రకటనలపై మాట్లాడాలి. జింకలా భయపడకుండా అడవి శునకంలా విరుచుకుపడాలి. అర్ణబ్‌ గోస్వామి నిజాన్ని దాచిపెట్టి తన డిబేట్‌లు నడుపుకోవడానికి వాడుకుంటారు. డిబేట్‌లో కూడా ఏ ఒక్కరి అభిప్రాయాన్ని ఆయన పట్టించుకోరు. అది ఆయన కార్వనిర్వహణ పద్ధతి.
   

   ఓ వైపు అర్ణబ్‌ గోస్వామిపై వరుస ట్వీట్లు చేస్తూనే ఆయనపై సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు వర్మ.
   ఈ సినిమాకు 'అర్ణబ్‌ - ది న్యూస్‌ ప్రాస్టిట్యూట్‌' అని టైటిల్‌ పెట్టారు. ఇప్పటి వరకు సినిమా ప్రముఖులు, అండర్‌ వరల్డ్‌ డాన్స్‌, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులపై సినిమాలు తీసిన వర్మ.. తొలిసారి ఒక జర్నలిస్ట్‌కు వ్యతిరేకంగా సినిమా చేయబోతున్నారు. అందులోనూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అర్ణబ్‌ గోస్వామిపై సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
  'ఒకవేళ అర్ణబ్‌ గోస్వామి ఈ సినిమాపై స్పందించినా, కించపరచడానికి ప్రయత్నించినా దాన్ని సినిమా ప్రచారం కోసం వాడుకుంటాను. అంతేకాదు, అర్ణబ్‌ నోరు ఓ చెత్తకుప్ప. సినిమాల్లో హీరోలుగా ఉన్న వారంతా బయటికి వచ్చి అర్ణబ్‌ గోస్వామి లాంటి విలన్‌పై పోరాడాలి!' అని వర్మ ట్వీట్‌ చేశారు.

                                                         

                                                             ఏమిటి నేరం..?

 ఏమిటి నేరం..?

   పాత్రికేయుడిగా కేంద్ర మంత్రులను, ఇతర పెద్దలను కలవడం తప్పుకాదు. కానీ, అర్ణబ్‌ పరిధులు దాటి వ్యవహరించాడు. వారి గొంతుగా మారి, వారికి లబ్ధి కలిగించడం కోసం నిజాల గొంతు నులిమాడు. సత్యాలను అసత్యాలుగా మార్చడానికి అన్ని అడ్డదారులు తొక్కాడు. స్వలాభం కోసం దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కాడు. అడ్డదారిలో రేటింగ్‌లు సాధించి, ప్రజల ధనాన్ని అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో పెద్ద ఎత్తున కాజేశాడు. 'ఆజ్‌తక్‌.. ఇండియా టుడే' వంటి ప్రత్యర్థి ఛానళ్లను పోటీ నుండి తప్పించడానికి అన్ని అడ్డదారులూ తొక్కాడు. ఈ నేరాలన్నింటిపైనా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు అర్ణబ్‌తో పాటు ఎంత మంది ప్రభుత్వంలోని వ్యక్తులు, ఏ స్థాయిలో వాళ్ల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వస్తాయో చూడాలి. అయితే, బిజెపి విజయంలో కీలకపాత్ర పోషించిన అర్ణబ్‌ను కాపాడుకోవడానికి అత్యున్నత నాయకత్వం కూడా రంగప్రవేశం చేసే అవకాశం ఉంది.