Feb 25,2023 21:42

ప్రజాశక్తి - ఏలూరు
         నేరస్తులు భయపడేలా.. ప్రజలు మెచ్చేలా పోలీసుల పనితీరు ఉండాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ అన్నారు. 2022 - 2023 సంవత్సర వార్షిక నేర సమీక్ష సమావేశం స్థానిక జిల్లా పోలీస్‌ ప్రధానకార్యాలయంలో ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ మాట్లాడుతూ నేరస్తులు భయపడేలా, ప్రజలు మెచ్చే విధంగా పోలీసు యంత్రాంగం పనిచేసి ప్రజలకు చేరువు కావాలన్నారు. లిప్రో యాక్టివ్‌ పోలీసింగ్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌ అనే అంశాలను వివిధస్థాయి విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తూ విద్యాలయాలు, కాలేజీల్లో జనసంచారం లేని ప్రదేశాలను తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఆ విద్యాలయాల్లో విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండేలా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యసనాలకు అలవాటు పడిన వారి వివరాలను సేకరించాలన్నారు. ఐటిడిఎ ప్రాంతాల్లోని ఏజెన్సీలో నాటుసారా నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టూడెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌పై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలన్నారు. వివిధ విద్యాసంస్థల వద్ద ఈవ్‌టీజింగ్‌పై పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్పందనలో వస్తున్న సివిల్‌ కేసులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు.
ఎస్‌పి రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్‌ నేరాల నివారణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు సమన్వయంతో చేపట్టిన అవేర్నెస్‌ ప్రోగ్రామ్‌కు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 2022 సంవత్సరానికి సిల్వర్‌ స్కాచ్‌ అవార్డును సాధించినట్లు తెలిపారు. భీమవరంలో నిర్వహించిన బాసట కార్యక్రమంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయాలపై సెమీఫైనల్‌ స్కాచ్‌ అవార్డు-2022 వచ్చిందన్నారు. ప్రో యాక్టివ్‌ పోలీస్‌ అనే అంశాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో సెమీ స్కాచ్‌ అవార్డు 2022 సాధించామన్నారు. ఎఫ్‌ఐసిసిఐ స్మార్ట్‌ పోలీసింగ్‌ అనే అంశాల్లో అవార్డును 2022 సంవత్సరానికిగాను జిల్లాకు వచ్చినట్లు, అదే స్ఫూర్తితో రానున్న కాలంలో ప్రజలకు మెరుగైన భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు సిబ్బంది సమిష్టి కృషితో సేవలు అందిస్తామని తెలిపారు. సచివాలయాల్లో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు తమకు కేటాయించిన ఉద్యోగ నిర్వహణ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.
ఎస్‌సి, ఎస్‌టి కోర్టు గౌరవనీయులు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ న్యాయ సంబంధమైన అనేక అంశాల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు, వాటికి సందేహాలను నివృత్తి చేస్తూ భవిష్యత్‌లో వారు నిర్వహించాల్సిన పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో జెసి పి.అరుణ్‌బాబు, జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రవీంద్ర ధర్మ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.