Dec 28,2022 23:57

మీడియాతో మాట్లాడుతున్న ఎస్‌పి గౌతమి శాలి

ప్రజాశక్తి-అనకాపల్లి
నేరాలను నివారించేందుకు పోలీస్‌ శాఖ పలు చర్యలు చేపడుతుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి శాలి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాల పట్ల రిపోర్టింగ్‌ పెరగాలని, అప్పుడే నేరస్తుల్లో భయం వస్తుందని తెలిపారు. దిశా పోలీస్‌ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెక్షన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. విజిటర్స్‌ మానిటరింగ్‌ సిస్టం ద్వారా బయట ప్రాంత వ్యక్తులపై నిఘా పెడుతున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో 30 మందితో రిస్క్‌ మేనేజ్మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సైన్‌ బోర్డులు, స్టాఫ్‌ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
2022లో రహదారి భద్రత ఎన్ఫోర్స్‌మెంట్‌ కేసులు 7,597, సైబర్‌ నేరాలు 59 నమోదైనట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై రూ.2,21,082 ఈ-చలానాలు విధించామన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాలు 389 నమోదు కాగా, వీటిలో 54 శాతం రికవరీ చేశామని చెప్పారు. పోగొట్టుకున్న 131 మొబైల్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా జిల్లాలోని కోడూరులో ఈ ఏడాది ఫిబ్రవరి 14న 570 కేసుల్లో పట్టుబడిన 84,148.344 కిలోల గంజాయి, సుమారు ఐదు లీటర్ల ఆశిష్‌ ఆయిల్‌, ఈనెల 24న 177 కేసుల్లో రెండవ విడతగా 25,573 కిలోల గంజాయి, 19.50 లీటర్ల ఆశిష్‌ ఆయిల్‌ ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ విజరు భాస్కర్‌, అనకాపల్లి, పరవాడ దిశా డీఎస్పీలు బి.సునీల్‌, పి.శ్రీనివాసరావు, మళ్ల మహేశ్వరరావు పాల్గొన్నారు.