Sep 21,2022 00:02

ఆటో డ్రైవర్లకు, పాసింజర్లకు అవగాహన కల్పిస్తున్న సిఐ రమేష్‌

ప్రజాశక్తి -ఆనందపురం : నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మధురవాడ క్రైమ్‌ సిఐ డి.రమేష్‌ సూచించారు. మండలంలోని భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లకు, పాసింజర్లకు దొంగతనాలు, నేరాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, స్నాచింగ్‌ బ్యాగ్స్‌ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అనుమానం కలిగినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు బయటకు వెళ్ళేటప్పుడు ఆభరణాలు బయటికి కనబడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటోలో ఒంటరిగా ప్రయాణించవద్దని చెప్పారు. ఆటో డ్రైవర్లు విధిగా లైసెన్స్‌, డ్రైవర్‌ సమాచారం, ఫోన్‌ నెంబర్లను డ్రైవర్‌ వెనుక ప్రయాణికులు కూర్చునే ముందు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.
మధురవాడ : నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మధురవాడ నేరవిభాగపు సిఐ డి.రమేష్‌ పేర్కొన్నారు మంగళవారం పిఎం పాలెం పోలీస్టేషన్‌ పరిధిలోని స్వాతంత్ర నగర్‌ డాక్‌యార్డులోని పలు మహిళా సంఘాలతో నేరాల నియాత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్‌ ఎస్‌ఐ ఆర్‌. శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.