Nov 17,2023 20:50

రికార్డులను తనిఖీ చేస్తున్న ఎస్‌పి దీపిక పాటిల్‌

ప్రజాశక్తి-రామభద్రపురం :   జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా వర్గాలను నియమించినట్లు ఎస్‌పి దీపిక పాటిల్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో వార్షిక తనిఖీలు చేపట్టారు. ముందుగా స్థానిక అంధుల పాఠశాల, భవిత కేంద్రాల్లో చదువుతున్న వికలాంగ విద్యార్థులతో మమేకమై, వారితో ముచ్చటించారు. వారికి సొంత నిధులతో దుస్తులు, పళ్లు పంపిణీ చేశారు. వారికి విద్యాబోధన చేస్తున్న కొల్లి ఈశ్వరరావు, రాజేశ్వరిని అభినందించారు. అనంతరం స్టేషన్‌ పరిసరాలు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. అనంతరం ఎస్‌పి విలేకరులతో మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, కక్షి దారులకు సమన్యాయం అందించేలా సిబ్బందికి సూచనలు చేస్తున్నామని తెలిపారు. పోక్సో కేసుల నమోదుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇంతవరకు 8 కేసులు బనాయించి నేరస్తులకు శిక్షలు పడేలా చేశామని వివరించారు. తరచూ నేరాలు చేస్తున్న వారిపై రౌడీ షీట్లు తెరుస్తున్నామన్నారు. కుటుంబ తగాదాలు శాంతియుతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశామన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్‌రేట్‌, రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఇది తమ సిబ్బంది తరచుగా చేస్తున్న ఆకస్మిక తనిఖీల ఫలితమేనని స్పష్టంచేశారు. మద్యం గొలుసు దుకాణాలు, బహిరంగ మద్యపానం నివారణకు కృషిచేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా సిబ్బంది కొరత ఉందని, త్వరలో జరిగే నియామకాలతో పూర్తి స్థాయిలో ప్రజా రక్షణకు సహకరిస్తామని తెలిపారు. సచివాలయ మహిళా పోలీసుల సేవలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ పోలీస్‌ స్టేషన్‌ను సిఐ, ఎస్‌ఐ, సిబ్బంది శ్రమదానం, కొంత సొంత నిధులు సమకూర్చుకొని యుద్ధ ప్రాతిపదికన అందంగా తీర్చిదిద్దిన తీరును ప్రశంసించారు. కార్యక్రమంలో డిఎస్‌పి శ్రీధర్‌, సిఐ తిరుమలరావు, ఎస్‌ఐ సురేంద్ర నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.