* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: నేరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్‌పి జి.ఆర్ రాధిక ఆదేశించారు. టెక్కలి పోలీస్ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జూలై నెల నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రాత్రివేళలో గస్తీని మరింత పటిష్టం చేసి నేర నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్య కూడళ్లు, ఆలయాలు, ఎటిఎంలు, ఒంటరిగా ఉన్న గృహాల వద్ద గస్తీ బలోపేతం చేయాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, పోక్సో వంటి కేసుల్లో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్టాపర్లు, డ్రమ్ములు, బ్లింకర్లను ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై వాహనాల పార్కింగ్‌లు లేకుండా చూడాలని సూచించారు. రాత్రి సమయాల్లో డ్రైవర్లకు ఫేస్ వాష్ చేయాలని, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తుల అదృశ్యం కేసులను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టాలన్నారు. దర్యాప్తులోఉన్న గ్రేవ్ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న అరెస్టులను వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, తీసుకున్న ఫిర్యాదులకు రశీదులను ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని స్పష్టం చేశారు. విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి గంజాయి, గుట్కా, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తీవ్రమైన కేసుల్లో సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తును వేగవంతం చేసి జిల్లా కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కేసులో చేపట్టిన దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్‌ఎస్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి, డిఎస్‌పి డి.బాలచంద్రారెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సమన్వయంతో నేరాల నియంత్రణ
రైల్వే, సివిల్ పోలీసులు సమన్వయంతోనే రైళ్లు, రైల్వేస్టేషన్‌లో నేరాలను నియంత్రించవచ్చని ఎస్‌పి రాధిక రైల్వే అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రైళ్లు, రైల్వేస్టేషన్‌లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. రైలులో, రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లు, రైల్వేస్టేషన్ ఆవరణలో నేరాల నియంత్రణకు గస్తీలు మరింత పెంచాలని సూచించారు. నేరాల నియంత్రణకు రెండు బృందాలుగా బీట్ తిరిగేందుకు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. నిరంతరం అప్రమత్తంగా తిరుగుతూ రైల్లో అపరిచిత వ్యక్తులను అనుమానం గల వ్యక్తులను గుర్తించి అక్రమ రవాణా అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, డిఎస్‌పిలు వై.శృతి, ఎస్.బాలరాజు, ఎస్‌బి సిఐ లక్ష్మణమూర్తి, ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ బి.కె సమాల్, జిఆర్‌పి ఎస్‌ఐలు శ్రీనివాస్, షరీఫ్ పాల్గొన్నారు.










