* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. దర్యాప్తులో నైపుణ్యాన్ని పెంచుకుని కేసుల్లో పురోగతి సాధించాలని సూచించారు. నేర విధానం, పాత నేరస్తుల జాబితా వివరాలను పరిశీలించి వేలిముద్రలు ఇతర ఆధారాలతో సరిపోల్చుకొని నిందితులను పట్టుకోవాలన్నారు. ఆస్తి నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. మిస్సింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలన్నారు. పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి, వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిదిలో ఎక్కువ, తీవ్ర నేరాలకు పాల్పడిన వారిపై రౌడీషీట్లు తెరవాలని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కేసులు, పోక్సో వంటి ముఖ్యమైన కేసుల్లో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసి సదురు వ్యక్తులను కోర్టు ముందు హాజరు పరచాలన్నారు. దర్యాప్తు పూర్తయిన ప్రతి కేసు ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అనంతరం సిసిటిఎన్‌లో నమోదు చేయాలని తెలిపారు. సైబర్ మోసాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎఎస్‌పి జె.తిప్పేస్వామి చిత్తూరు ట్రాఫిక్ డిఎస్‌పిగా, శ్రీకాకుళం డిఎస్‌పి వై.శృతి ఆత్మకూరు డిఎస్‌పిగా పనిచేసిన సమయంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు డిజిపి కె.రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి వచ్చిన ప్రశంసాపత్రాలను ఎస్‌పి వారికి అందజేసి, అభినందనలు తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి, డిఎస్‌పి వై.శృతి, శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










