Sep 17,2021 06:45

    జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన 2020 సంవత్సర వివరాలు ఆందోళన గొల్పుతున్నాయి. కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నా మొత్తంగా ఆ ఏడాదిలో 28శాతం మేర కేసులు పెరగడం తీవ్రమైన విషయం. నేరాల రేటు అంటే ఒక లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య 2019లో 385.5 ఉన్నదల్లా 2020లో ఏకంగా 487.8 కి ఎగబాకడం పరిస్థితి ఎంతలా దిగజారిందో స్పష్టమవుతోంది. హత్యా నేరాలు కూడా ఒక శాతం పెరిగి 29,193 నమోదయ్యాయి. శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40 శాతం ఎక్కువ. వరుస వివరాలు పేర్కొంటూ పోతే నేర భారత చిత్రం ఆవిష్కృతమవుతుంది. దళితులపై అకృత్యాలు 9.4 శాతం పెరిగి 50,291 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధ చట్టం కింద నమోదైన కేసులు 8.5 శాతం (4,273) కావడం దారుణం. గిరిజనులపై నేరాలు 2019 కన్నా 9.3 శాతం ఎక్కువయ్యాయి. సమాజంలో అట్టడుగున వున్న దళితులు, గిరిజనులపై దాడులు, నేరాలు పెరగడం మోడీ సర్కారు వివక్షాపూరిత పాలనకు నిదర్శనం.
     ప్రజలు సుభిక్షంగా ఉంటే వారు ప్రశాంత జీవనం గడుపుతారు. నేరాలు ఘోరాలకు పాల్పడరన్నది నిర్వివాదాంశం. ఏదైనా ప్రభుత్వ పాలనా తీరుకు శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నమోదు వంటివి ముఖ్యమైన కొలబద్దలు. ఆ రీత్యా చూస్తే 2019 కన్నా 2020లో దేశంలో నేర నమోదు పెరిగిందంటే పాలన భ్రష్టు పట్టినట్లు విదితమవుతోంది. మత వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే మతతత్వ శక్తులు గద్దెపైనున్న నేపథ్యంలో ఇంతకన్నా మెరుగైన పరిస్థితిని ఊహించడం కష్టమే! ప్రజా సమస్యలను పరిష్కరించాలని, మత సామరస్యం నిలబడాలని కోరుకునే శక్తులు, వ్యక్తులు, రాజకీయ పార్టీలపై ఎడాపెడా అక్రమ కేసుల్ని బనాయిస్తుండడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరగవచ్చు. అటు కన్నయ్య కుమార్‌ మొదలు ఇటీవల కన్ను మూసిన స్టాన్‌స్వామి వరకూ ఇలాంటి ఎన్నో ఉదంతాలను పేర్కొనవచ్చు. తొమ్మిది నెలలుగా సాగుతున్న రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వమూ, బిజెపి పాలిత రాష్ట్ర సర్కార్ల తీరు తాజా తార్కాణం. తప్పుడు కేసు నమోదు చేసి జైళ్లలో నిర్బంధించి, కోర్టుల చుట్టూ తిప్పి హింసించడం ఫాసిస్టు తరహా పాలనా పద్ధతుల్లో భాగమే. సకల రాజ్యాంగ వ్యవస్థలను కలుషితం చేస్తున్న బిజెపి పాలనలో పోలీసు యంత్రాంగాన్ని ప్రజా సేవకు లేదా భద్రతకు వినియోగిస్తారని ఎవరూ అనుకోలేరు. శాంతి భద్రతల పరిరక్షణ పాలకుల విద్యుక్త ధర్మం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మరింత ప్రధానం. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు ప్రశాంత వాతావరణం పరిఢవిల్లే పాలనను అందించాలి. అలా ఉండాలంటే అందరికీ కనీసావసరాలన్నీ తీరే విధంగా ఉపాధి కల్పించాలి లేదా ప్రభుత్వమే రాయితీలివ్వాలి. ప్రస్తుత కార్పొరేట్‌ హిందూత్వ కూటమి పాలనలో ఈ చర్యలను ఆశించడం అంటే ఎడారిలో నీరు వెతకడమే !
    రాష్ట్రంలోనూ క్రైమ్‌ రేట్‌ తగ్గలేదు. మద్యం అక్రమ రవాణా, ఇసుక, ఇతర మత్తు పదార్థాల కేసులు రెట్టింపు అయ్యాయి. 2019లో 26,522 అక్రమ మద్యం, ఇసుక కేసులు నమోదైతే 2020 నాటికి 49,108 కేసులు నమోదయ్యాయి. అలాగే హత్యలు, మహిళలపై హింస, దళితులు, గిరిజనుల దాడులు, కిడ్నాప్‌లు, సైబర్‌ క్రైమ్‌, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గుచేటు. పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన నేరాల్లో దేశంలో ఎ.పి రెండవ స్థానంలో ఉంది. ఐపిసి కింద నమోదైన కేసుల సంఖ్య ఒక లక్ష 19 వేల నుండి ఒక లక్ష 88 వేలకు పెరగడం తీవ్రమైన విషయం. అయితే, పోలీస్‌ స్టేషన్‌లకు రాకుండానే మొబైల్‌ యాప్‌ల ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలు కొంతవరకు వినియోగించుకున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అప్రజాస్వామికంగా అణచివేయడంపై కాకుండా క్రైమ్‌ రేటును అణచివేయడంపై దృష్టి పెట్టడం అవసరం.