Jan 31,2021 12:04

     పోలీసు అంటే కఠినంగా ఉంటారని, మాట కటువుగా ఉంటుందని నానుడి. కానీ అతని మనసు చాలా సున్నితమైంది. పెన్నులు, పుస్తకాలు పట్టుకోవాల్సిన వయస్సులో చిన్నారులు రైళ్లలో యాచిస్తూ ఉంటే చూసి తల్లడిల్లిపోయారు. ఎలాగైనా వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు. నిరుపేద పిల్లలకు నేనున్నానంటూ ఉచితంగా బోధించేందుకు ఏకంగా పాఠశాలనే ప్రారంభించారు. ప్రతినెలా తన జీతంలో నుంచి పాఠశాల కోసం పదివేలు ఖర్చుపెడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే ఉత్తరప్రదేశ్‌ ఉన్నావోకు చెందిన రైల్వే కానిస్టేబుల్‌ (జిఆర్‌పి) రోహిత్‌కుమార్‌ యాదవ్‌. పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన ఆయనకెలా వచ్చిందో తెలుసుకుందాం పదండి.
    త్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో రైళ్లలో యాచించే చిన్నారుల కోసం రెండేళ్లుగా రైల్వే కానిస్టేబుల్‌ రోహిత్‌ ఒక పాఠశాలను నడుపుతున్నారు. కేవలం ఐదుగురితో ప్రారంభమైన పాఠశాల నేడు 90 మంది విద్యార్థులతో నడుస్తోంది. 'చాలా సంవత్సరాల క్రితం మా నాన్న పేద విద్యార్థుల కోసం ఎటావా జిల్లాలో ఒక పాఠశాలను ప్రారంభించారు. కానీ అప్పట్లో కొన్ని కుటుంబ సమస్యల వల్ల పాఠశాలను మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నాకు ఉద్యోగం ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. అందుకే నా తండ్రి కలను నెరవేర్చాలి అనుకున్నా. జూన్‌ 2018లో ఒకరోజు ఉన్నావో నుంచి రాయబరేలికి ప్రయాణిస్తున్నప్పుడు రైల్లో యాచించే కొంతమంది పిల్లలు కలిశారు. అందులో ఒక పిల్లవాడు 'ఆకలేస్తుంది డబ్బులివ్వరూ?' అంటూ దగ్గరకు వచ్చాడు. పెన్నులు, పుస్తకాలను పట్టుకోవాల్సిన వయస్సులో వారి చేతిలో గిన్నె చూసి జాలేసింది. ఆ సంఘటన జరిగిన కొన్నిరోజుల తరువాత కూడా డబ్బు కోసం దగ్గరకు వచ్చిన పిల్లవాడి ముఖాన్ని మరచిపోలేకపోయాను. కొన్ని డబ్బులిస్తే వారి సమస్య దూరమవ్వదు. అందుకే వారి భవిష్యత్తును మంచిగా మార్చగల పని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా' అన్నాడు రోహిత్‌.
   పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న వెంటనే రోహిత్‌ రైళ్లలో యాచించే చిన్నారుల అడ్రసులు తెలుసుకున్నారు. 'పిల్లలను పాఠశాలకు పంపమని ఒప్పించడానికి ఎన్నోసార్లు వారి ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. తమకు వచ్చే ఆదాయాన్ని కోల్పోవడానికి కొందరు సిద్ధంగా లేరు. మరికొందరు తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలని ఉన్నా తమ ఆర్థికస్థోమత సహకరించదని బాధపడ్డారు. ఎలాగైనా ప్రతి ఒక్క చిన్నారి చదువుకునేలా చేయాలనే నా కలను వదలదలచుకోలేదు. ''హర్‌ హాత్‌ మెయిన్‌ కలాం (ప్రతి చేతిలో ఒక పెన్ను)'' అనే నినాదంతో ముందుకెళ్లాను. ఉన్నావో స్టేషన్‌ రైల్వేట్రాక్‌ సమీపంలో కేవలం ఐదుగురు విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించా. మొదట్లో ఇంగ్లీషు, హిందీ బోధించేవాడిని. రానురాను నా పాఠశాలకు ఒక్కొక్కరుగా రావడం మొదలెట్టారు. ప్రస్తుతం 90 మంది విద్యార్థులు ఉన్నారు' అంటున్నారు రోహిత్‌.
   రోహిత్‌ అంకితభావాన్ని చూసిన కొందరు ఎన్జీఓలు పాఠశాలను అద్దె ఇంట్లోకి మార్చడానికి సహకరించారు. ప్రస్తుతం రోహిత్‌తోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. డ్యూటీ సమయాన్ని బట్టి కొన్ని రోజులు ఉదయం, మరికొన్ని రోజులు సాయంకాలం పాఠాలు బోధిస్తున్నారు రోహిత్‌. మొదట పిల్లలకు ప్రత్యేకమైన ఆశయం అంటూ ఏమీ లేదు. నేడు వారిలో కొందరు వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు కావాలని కోరుకుంటున్నారు. మరికొందరు పాడటం, నృత్యం, డ్రాయింగ్‌ పట్ల కూడా ఆసక్తి చూపుతున్నారు. రోహిత్‌కు నెలకు 40 వేల రూపాయల జీతం వస్తుంది. వాటిలో పదివేలు పాఠశాలకు ఖర్చు చేస్తారాయన. 2019 చివరినాటికి అప్పటి జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారి సహాయంతో తరగతులను కోరరి పంచాయతీ బహవాన్‌ భవనానికి మార్చారు. రోహిత్‌ నడిపే పాఠశాలకు ఎవరైనా సహాయం చేయదలచుకుంటే 9532427300 ఫోన్‌ నెంబరును సంప్రదించవచ్చు.