Jan 31,2021 09:20

   'చదువు కొనలేక చదువుకోలేక బాధపడుతున్న ఎందరో అభాగ్యులను కూడా చదువుకి పరిచయం చేస్తే మన దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది' అన్న వేదవ్యాస్‌ మాటలు శ్రీకష్ణకి స్ఫురణకి వచ్చాయి.
'ఆన్‌లైన్‌ చదువు.. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న కార్పొరేట్‌ స్కూళ్ళు, తల్లిదండ్రులను ఆర్థికంగా దెబ్బదీస్తున్న విద్యావ్యవస్థ.. ప్రస్తుత ప్రపంచ పరిణామాల దృష్ట్యా చదువు యొక్క రూపం కొత్తరూపు దాల్చబోతోంది. పిల్లలు బడికి వెళ్ళడానికి బదులు 'బడే' వాళ్ళ దగ్గరకే వచ్చే రోజులు. ఈ నేపథ్యంలో తమతమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిందిగా మన స్టూడియోకి వచ్చిన విద్యావేత్తలను, మేధావులను కోరుతున్నాము!' అంటూ ఓ టీవీ ఛానెల్‌ చర్చా కార్యక్రమం పెట్టింది. రెండు గ్రూపులుగా విడిపోయి, ఎవరికి తోచింది వాళ్ళు ఆన్‌లైన్‌ విద్య మంచిచెడుల గురించి వాదోపవాదాలు చేస్తున్నారు.
     టీవీ చూస్తున్న శ్రీకృష్ణకి ఒక్కసారిగా చాలా సందేహాలు కలిగాయి. 'మనదేశానికి ఈ ఆన్‌లైన్‌ విద్య మంచి చేస్తుందా? లేక బడిలో చదువుకునే పిల్లలు దీనికి ఇమడ లేక పూర్తిగా చదువుకు దూరమవుతారా? ఈ ఆలోచనల్లో ఉండగా.. 'నాన్నా కృష్ణా! బయటకెళ్లి కాసిన్ని కూరలు పట్టుకురా!' అని తల్లి దేవకి అతని చేతులో సంచి పెట్టింది. 'అబ్బా ! ఇప్పుడా?' అని విసుక్కున్నాడు.
'వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న నీకే అంత బద్ధకం అయితే, రోజూ వండి వార్చే నాకెంత ఉండాలి రా? లే లే ! మీ నాన్న ఇంకా నిద్ర లేవలేదు. ఇద్దరూ అలా పట్టనట్టు ఉంటే, నేను కూడా హాయిగా పడుకుంటా!' అని గట్టిగా అంది.
'కోప్పడకు అమ్మా! వెడతాలే !' అంటూ లిఫ్ట్‌ వైపుకి కదిలాడు.
    కూరలు కొనుక్కొని తిరిగి వచ్చి స్కూటర్‌ పార్క్‌ చేశాడు. సెల్లార్‌లో అపార్టుమెంటు వాచ్‌మెన్‌ ఏడుకొండలు గది ముందు ఒక బల్ల, దాని మీద ఇస్త్రీ పెట్టె, ఇస్త్రీ చేయాల్సిన బట్టలు ఉన్నాయి. అక్కడే బల్ల మీద స్కూలు పుస్తకాలు ముందేసుకుని, ఏకాగ్రతగా చదువుతున్న ఏడుకొండలు కూతురు ఆరేళ్ళ కుముద ఎప్పట్లాగే కనబడింది. కుముద చాలా చురుకైన పిల్ల. ఎప్పుడు చూసినా చదువులో లీనమై ఉంటుంది. పలకరిస్తే వినయంగా లేచి, చిరునవ్వుతో సమాధానం చెప్తుంది. ఆ నవ్వు అప్పుడే వికసిస్తున్న సన్నజాజి పువ్వులా ఉంటుంది. ఆ రోజు పొందికగా వేసుకున్న రెండు జడలు, వాటికి కట్టిన రిబ్బను, నుదుట చిన్నబొట్టుతో కళకళలాడే మోముతో శుభ్రంగా ఉతికిన గౌను ధరించి కనిపించింది. శ్రీకృష్ణకి ఆ అమ్మాయి ఒద్దిక, శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుంది.
   'ఏదో ఆనులైను సదువంట, ఓ వారం నుంచి మొదలెడతారంట.. ఏదో నెట్‌.. అని పెట్టుకోమంటున్నారు.. ఒక పెద్ద కంపోటర్‌ కొనుక్కో మంటన్నారు, లేకపోతే సెల్‌ ఫోనుంటే సాలంట. ఏంటో నాకేమర్ధవ్వలేదు' అని ఏడుకొండలు విచారంగా మాట్లాడుతున్నాడు.
'ఆటికి ఎంత ఖర్చవుద్దో?' అని ఆదుర్దాగా అడిగింది ఏడుకొండలి భార్య అలివేలు.
'ఫోను ఖరీదు శానా ఉంటది కాబోలు' అని బుర్ర గోక్కున్నాడు.
    'పెద్ద పెద్ద పోనులు, కంపోటర్లూ మనమెక్కడ నుండి కొనగలం? పిల్ల సదువుకే అంతంత ఖర్సు పెట్టుకుంటే రేపు దాని పెళ్ళెలా సేత్తం? బడి మానేసి ఇంట్లో కూసోపెట్టు మావ! నాతోపాటు పనులు నేర్సుకుంటాది' అంది అలివేలు.
    వాళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణ జాలిపడ్డాడు. వీళ్ళకి ఏదైనా సాయం చేసి, కుముద చదువు సాగేలా చూడాలి అనుకుని లిఫ్టు ఎక్కాడు. మెదడులో పుట్టిన ఒక ఆలోచన అతన్ని కుదురుగా కూర్చోనివ్వలేదు. ఇంతలో అపార్టుమెంటు సెక్రటరీ ముకుందరావు ఫ్లాట్‌ ఓనర్స్‌ మీటింగ్‌ ఉందని కబురు పంపాడు. పార్కింగ్‌ ప్లేస్‌లో మీటింగ్‌ మొదలయ్యింది. అందరూ మాస్క్‌లు కట్టుకొని కూర్చున్నారు.
   ముకుందరావు మాట్లాడడం మొదలుపెట్టాడు..'ఈ కరోనా తగ్గుముఖం పట్టే సూచనలు కనుచూపు మేరలో కనపడ్డం లేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల, అదృష్టవశాత్తు మన ఫ్లాట్స్‌లో ఎవ్వరూ దాని బారిన పడలేదు. ఈ నెల మీటింగ్‌ ఉద్దేశ్యం ఏమిటంటే, మన టెర్రస్‌ మీద ఒక చిన్న జిమ్‌ ఏర్పాటు చేద్దామని ఉంది. దానికి మీరందరూ సహకరించాలి. దానికి అయ్యే ఖర్చు, ఎస్టిమేషన్‌ త్వరలో చెప్తాను. అందరూ తలా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. మినిట్స్‌ బుక్‌లో సంతకాలు తీసుకుని, మీటింగ్‌ ముగించాడు. అందరూ తిరిగి వెళ్లిపోయే తొందర్లో ఉన్నారు.
'అంకుల్‌! మీ అందరికీ ఒక విన్నపం!' అని శ్రీకృష్ణ కుర్చిలోంచి లేచి, గట్టిగా పిలవడంతో, అందరూ అతని కేసి విసుగ్గా చూశారు.
'ప్లీజ్‌! ఒక్క నిముషం కూర్చోండి!' అని అందర్నీ అర్ధించాడు చేతులు జోడించి. అతని అభ్యర్ధనకి ఏమీ అనలేక కూర్చుని, ఏం చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు.
    'ఈ కరోనా భయం వల్ల పిల్లల చదువులు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయాయి. కానీ ఏదో ఒక దారిలో వెళ్ళి చదువుకోవాలి కాబట్టి, ఆన్‌లైన్‌ చదువులు తెర మీదకి వచ్చాయి!' అని కాసేపు ఆగాడు.
    'అవును! అందరం దానికి ఆహ్వానం పలకక తప్పదని తెలుస్తోంది. ఇప్పుడు నా జేబుకి చిల్లు పడేలా ఉంది. ఒక కంప్యూటర్‌, దానికి నెట్‌, లేదా ఒక స్మార్ట్‌ఫోన్‌ కొనాలి. నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి రెండు ఫోన్‌లు కొనాలి. అసలే హాఫ్‌ శాలరీ ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా మీట్‌ అవ్వాలా? అని ఆలోచిస్తున్నాను' అని వాపోయాడు ఒక ఫ్లాట్‌లో ఉండే విరించి.
    'మార్పు అనివార్యం అంకుల్‌! మనకి ప్రస్తుతానికి ఇంతకన్నా మార్గం లేదు. కాబట్టి ఈ మార్పుని ఆహ్వానించక తప్పదు. కానీ నేను మిమ్మల్ని అర్ధించేది మరొకటి ఉంది.. అని వాళ్ళ మొహాల్లోకి చూశాడు. మనం ఏదో విధంగా.. అంటే బ్యాంకులో లోను పెట్టో, ఆఫీసులో అడ్వాన్స్‌ తీసుకునో ఇవన్నీ కొనుక్కుంటాం. కానీ మనతో కలిసి జీవిస్తున్న అతని పరిస్థితి కాస్త ఆలోచించండి..!' అని చేతులు కట్టుకొని పక్కన నిలబడ్డ ఏడుకొండల్ని చూపించాడు. 'కుముద చక్కగా చదువుకుంటుంది. ఇప్పుడు ఇతను ఈత రాని నావికుడిలా దిక్కుతోచక, పిల్లని ఎలా చదివించాలా, లేక చదువే మానిపించాలా అని ఆలోచిస్తున్నాడు'.. అని ఆగాడు.
'అయితే, మనమేం చేస్తాం? ఎవరి బతుకులు వాళ్ళవి!' అని సింపుల్‌గా అన్నాడు ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ లక్ష్మీపతి.
'అలా అనొద్దు సార్‌! మనం అందరం తలా ఒక చెయ్యి వేసి, ఒక స్మార్ట్‌ఫోన్‌ కొనిద్దాము. నెట్‌ కనెక్షన్‌ ఇప్పించి, ఆ బిల్‌ అందరం కలిసి పే చేద్దాం!' అన్నాడు.
'నీకేమైనా మతిపోయిందా? అవన్నీ మనం ఎక్కడ ఇవ్వగలం? అవన్నీ ఇవ్వాలంటే, మెయింటెనెన్స్‌ పెంచాలి!' అని అడ్డుచెప్పాడు సెక్రటరీ ముకుందరావు.
'మన సంపాదనలో మనం చేయబోయేది ''చిరు సాయం'' అంకుల్‌!' అని చెప్పబోతున్నాడు.. అందరూ అతని మాట పెడచెవిన పెట్టారు.
    'ఒకవేళ మనం ఫోను కొనిచ్చినా, ఇంటర్నెట్‌ పెట్టించినా, దానిలో వీడియోలు, సినిమాలు చూస్తారు. దానిమీద మనకి కంట్రోల్‌ ఏం ఉంటుంది? ఎక్కడున్నవాళ్లు అక్కడ ఉండడమే మంచిది!' అన్నాడు ముకుందరావు. ఆ మాటలకి ఏడుకొండలి మొహం చిన్నబోయింది.
'అలా అనకండి సార్‌! కుముద ఆణిముత్యం! చదువు తప్ప మరో ఆలోచన లేని పిల్ల. నాదీ పూచీ' అని శ్రీకృష్ణ భరోసా ఇవ్వబోయాడు.
'ఇంక దీనిమీద చర్చ అనవసరం. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, మీటింగ్‌ అయిపోయింది!' అని లేచిపోయాడు. అందరూ ఆదివారం టీవి ప్రోగ్రాములంటూ హడావుడిగా ఫ్లాట్స్‌లోకి వెళ్ళి, తలుపులు వేసుకున్నారు.
శ్రీకృష్ణ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇదేమీ తెలియని కుముద, తన చదువేదో తాను చదువుకుంటోంది.
'బలమైన ముందడుగు మనదైతే, మనతో నడిచేవాళ్ళు మరెందరో' అన్న వేదవ్యాస్‌ వాక్కులు గుర్తొచ్చాయి. ఒక నిర్ణయానికి వచ్చినట్టు అతని ముఖం చెప్తోంది.
                                                                  ***

       కుముద మొహం ఆనందంతో 'చిరుదివ్వెలా' వెలిగిపోతోంది.. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు శ్రద్ధగా వింటోంది. ఏడుకొండలు కూతురి ముఖంలో ఆనందాన్ని చూసి సంబర పడిపోతున్నాడు.
'కిట్టయ్య గారు.. మన పాలిటి దేముడు. పిల్లకి ఫోన్‌ కొనిచ్చారు. దానితో పాటు అదేదో ఫోనులో వేయించారు..' అని బుర్ర గోక్కున్నాడు. 'మొబైల్‌ డేటా నాన్న!' అని అందించింది కుముద.
'అవును పిల్ల! అదే!..' కుముద తెలివికి సంతోష పడిపోయాడు.
'ఏదో రకంగా కట్టపడి, దీన్ని గొప్పదాన్ని సెయ్యాలి!' అని అతి జాగ్రత్తగా శ్రీకృష్ణ చొక్కాని ఇస్త్రీ చేసి, పక్కన జాగ్రత్త చేశాడు.
'మరి ఫోను నెల బిల్లు డబ్బులు ఏడ నుండి తేవాల?' అని సందేహం వ్యక్తం చేసింది అలివేలు.
'సూద్దారి!' అని ఆలోచనలో పడ్డాడు.
                                                                  ***

    శ్రీకృష్ణ వర్క్‌ ఫ్రమ్‌ హోంలో బిజీగా ఉన్నాడు. అపర్ణ నుంచి ఫోన్‌. చాలాసేపు రింగ్‌ అయ్యాక, ఫోన్‌ తీసి మాట్లాడాడు.
'ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోను చేసినా ఆన్సర్‌ చెయ్యవే?' అని కోప్పడింది.
'జస్ట్‌, కొద్దిగా బిజీ! పాపం మా అపార్టుమెంటు వాచ్‌మెన్‌ కూతురి చదువు సమస్య' అని చెప్పబోతుంటే..
'ఎప్పుడూ ఆ ప్రజాసేవేనా? నీకు నేను తప్ప అందరూ కావాలి. నువ్వంటే ఇష్టపడి పిచ్చిదానిలా నీ కూడా పడుతున్నా కదా! అందుకే లోకువ. నా ఫ్రెండ్‌ రీతూ బారుఫ్రెండ్‌ అస్సలు దాన్ని వదిలి ఉండడట! అఫ్‌కోర్సు కరోనా ఉంది కాబట్టి, ఇద్దరు కలవలేపోతున్నారు అనుకో! కానీ ఫోన్‌లో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడట! నీకు పది రోజులుగా ఫోన్‌ చేస్తున్నా. ముద్దూ ముచ్చట ఎలాగూ లేదు. అరె! కనీసం ఫోన్‌ తియ్యడానికి కూడా నీకు తీరిక లేని ప్రజాసేవా?' అని గట్టిగా దెబ్బలాడింది.
'అప్పూ! సోషల్‌ సర్వీస్‌ నాకు ఇష్టం అని కలిసిన మొదటిరోజే చెప్పాను. నువ్వు అవన్నీ చూసే ఇష్టపడ్డావని ఆ రోజు అన్నావు. ఇప్పుడేమో ఇలా విమర్శించడం తగదు. కారణం లేకుండా నాకు ఇష్టమైన పనిని అస్తమాను విమర్శిస్తే, మనిద్దరి అభిప్రాయాలూ కలవవని తెలిసిపోతోంది!' అన్నాడు శ్రీకృష్ణ.
'ఓకే! నీకూ నాకూ కుదరదులే!' అని ఫోన్‌ పెట్టేసింది.
శ్రీకృష్ణ బాధతో తల పంకించాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని మర్చిపోయి, తన కార్యాచరణ గురించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
'నేను సైతం' అనే ఒక ఫేస్‌బుక్‌ గ్రూపు తన మిత్రులతో మొదలుపెట్టాడు. అందులో కుముదకి జరిగిన సాయం గురించి చెప్పాడు. అది వైరల్‌ అయ్యింది. అలా ఎందరో స్పందించారు. వారిలో ఎక్కువమంది శ్రీకృష్ణలా తమ చుట్టూ ఆర్థికంగా బలహీనమైన వారికి సాయం చేయడం మొదలుపెట్టారు. అది ఒక ఉద్యమంలా రూపు దాల్చి, ఫేస్‌బుక్‌లో హల్‌ చెల్‌ చేసింది.
ఇది చూసిన ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ తమ వంతు సాయంగా, ఏడుకొండలికి నెట్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇచ్చాడు. అలాగే ప్రతి అపార్టుమెంట్‌లోనూ వాచ్‌మెన్‌ పిల్లలకి ఉచితంగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ అందించారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. 'మన సంకల్పం మంచిదైతే, మనకి ప్రపంచం తోడవుతుంది' అనే వేదవ్యాస్‌ మాటలు మనసులో మెదిలి, శ్రీకృష్ణకి మరింత ధైర్యాన్నిచ్చాయి.
 

                                                                  ***

   స్మార్ట్‌ఫోనులు ఉన్న కొంతమంది తల్లిదండ్రులకు హఠాత్తుగా ఒక సమస్య ఎదురైంది. అందులో ఏడుకొండలు కూడా ఒకడు. కుముద కళ్ళు వాచిపోయి, ఎర్రగా అయ్యి నీరు కారడం మొదలయ్యింది. అతనికి అర్థం కాలేదు. వెంటనే శ్రీకృష్ణ దగ్గరకి పరిగెత్తాడు. సమస్య అతనికి అర్థమైంది.
'ఓV్‌ా! అవిరామంగా మొబైల్‌ ఫోన్లో పాఠాలు చూడడం వల్ల కళ్ళు అలిసిపోయి ఈ ఇబ్బంది వచ్చిందన్నమాట' అని కుముద కళ్ళల్లో ఐ డ్రాప్స్‌ వేసి, పంపించాడు. ఆమెకి జరిగిన విషయం తన ఫేస్‌బుక్‌ గ్రూపులో చర్చించాడు.
'ఇలా ఎంతమంది పిల్లలు బాధ పడుతున్నారో?' అని అందరూ బాధపడ్డారు.
'నాయకులు తమ ఓట్ల కోసం టీవీలు, ఫ్రిజ్‌లు పంచిపెట్టారు. ఇప్పుడు పిల్లలకి కంప్యూటర్స్‌ కొనివ్వచ్చు కదా!' రాజకీయాల మీద ఆసక్తి ఉన్న మాధవ్‌ అన్నతను అన్నాడు.
'అవునవునని!' కొంతమంది అన్నారు.
'ప్రస్తుతం ఈ పరిస్థితి గట్టెక్కాలంటే ఏదైనా ఐడియా ఇవ్వండి. పిల్లలు ఆ చిన్న ఫోనుల్లో క్లాసులు చూడలేక, వినలేక చాలా ఇబ్బందిపడుతున్నారు!' అని శ్రీకృష్ణ తన గ్రూపు సభ్యుల్ని అడిగాడు.
తలా ఒక సూచన చేశారు. ఏవీ అతనికి తృప్తిని ఇవ్వలేదు. 'ఒకే ఫ్రెండ్స్‌! మళ్ళీ కలుద్దాం!' అని సిస్టమ్‌ ఆఫ్‌ చేశాడు.


                                                                  ***

     రాత్రంతా మెలకువుగా ఉండి, ఆఫీసు పనిచేసి అలిసిపోయి పడుకున్నాడు శ్రీకృష్ణ. మర్నాడు ఉషోదయ కిరణ కాంతులు అతన్ని తట్టి లేపాయి. లేచీ లేవగానే అతని మదిలో ఒక ఆలోచన ఉదయించింది. వెంటనే తన కంపెనీ ఐటి డిపార్ట్‌మెంట్‌కి ఫోన్‌ చేసి వివరాలు సేకరించాడు. పాతబడిపోయిన కంప్యూటర్స్‌ 'కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ'లో భాగంగా పేద పిల్లలకి పంచిపెడితే బావుంటుందని కంపెనీ సిఇఓతో మాట్లాడి ఒప్పించాడు. అది ఫలించగానే, వాటిని సమూహ సభ్యుల ద్వారా అవసరార్థులకి అందేలా చేశాడు.
అలాగే ఎవరి దగ్గరైన వాడనివి ఉంటే వాటినీ తమ దగ్గరలో ఉన్న చదువుకునే ఆర్థికంగా బలహీనమైన పిల్లలకి పంచమని ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ షేరింగ్‌లో అర్ధించాడు. నాలుగు రోజుల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. అలా వాళ్ళని ఉత్తేజపరిచి, ఈ సమస్యకి ప్రస్తుతానికి చిన్న పరిష్కారం కనుగొన్నాడు.
కుముదకు తన దగ్గర వాడకుండా ఉంచిన లాప్‌టాప్‌ ఇచ్చాడు. ఆమె చదువు అవిరామంగా కొనసాగుతోంది. తమ అపార్టుమెంట్‌లో ఉండే యువకుడు తనకున్న పరిధిలో పేద పిల్లలకి ఇంత సహాయం చేస్తుంటే, తాము కనీసం అతనికి మాట సాయం కూడా చేయలేదని సిగ్గుపడ్డారు. కుముద చదువుకి అయ్యే ఖర్చు అందరూ పంచుకుందామని అపార్టుమెంట్లో వాళ్లంతా ఒక నిర్ణయానికి వచ్చారు.
శ్రీకృష్ణ చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమం తెలిసిన ఒక టీవీ ఛానల్‌ 'యువ రక్తం' అనే ప్రోగ్రాములో అతన్ని ఇంటర్వ్యూ చేసింది.
'మీరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కదా! మీకు అస్సలు తీరిక ఉండదు కదా! ఈ సామాజిక కార్యక్రమం ఎందుకు చెయ్యాలనిపించింది?'
'మా వేదవ్యాస్‌.. ఈ దేశంలో చదువుకునే హక్కు అందరికీ ఉంది. ఇక్కడ ఉన్నవాడు, లేనివాడు అనే తేడా లేదు! ఎంతమంది అక్షరాస్యులు సమాజంలో పెరిగితే దేశం అంత అభివృద్ధి చెందుతుంది అనేవారు. ఆయన సందేశమే నాకు స్పూర్తి!'
'ఈ ఆన్‌లైన్‌ విద్యపై మీ అభిప్రాయం?'
'ప్రస్తుతానికి పిల్లలకి విద్య ఇలా అందించడం తప్ప మరో మార్గం లేదు. ఇది గొప్ప మార్పుకి నాంది. ఈ విధానాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతారా అన్నది విద్యాశాఖ అధికారుల చేతుల్లోనూ, ఈ కొత్త తరహా విద్యని ఎంత బాగా పిల్లలకి అందివ్వగలమా! అనే ఆలోచన గురువుల చేతల్లోనూ ఉంది!'
'మరి పిల్లలు దీనిని ఆకళింపు చేసుకోగలరంటారా?'
'తప్పకుండానండీ! ఒకప్పుడు పలక మీద రాసేవాళ్ళు, తర్వాత పుస్తకం, ఆ తర్వాత కంప్యూటర్‌.. ఇలా వివిధ దశల్లో విద్య మార్పు చెందింది కదా! పిల్లలు మట్టిముద్దల్లాంటివారు. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు.'
'ఆన్‌లైన్‌ విద్య అందరకీ అందుబాటులో లేదని, చాలా ఖరీదని అంటున్నారే?!'
'అందుకనే తక్కువ ఖరీదుకు కంప్యూటర్లు తయారుచేయడానికి ముందుకు వచ్చిన దేశీయ కంపెనీలకు సబ్సిడీల రూపంలో ప్రభుత్వ సహకారం ఇవ్వాలి. అలాగే, స్కూల్స్‌ మేనేజమెంట్స్‌ కూడా ఫీజులు తగ్గిస్తే, ఎందరో పిల్లలకు చదువుకునే అవకాశం వస్తుంది.'
'ఇంటర్వ్యూ మొదట్లో మీ మాటల్లో ''వేదవ్యాస్‌'' అనే పేరు వినబడింది. ఆయన మీ గురువు గారా? ఎక్కడ ఉంటారు?'
'ఆయన ఇక్కడే ఉన్నారండి! అంటూ తన తల చూపించాడు. నా 'ఆలోచన'కే ఆ పేరు!' అని నవ్వాడు.
యాంకర్‌ ఆశ్చర్యంగా అతనికి రెండు చేతులతో నమస్కరించింది. తన సామాజిక కార్యక్రమాలని మరింత విస్తరించే దృఢ సంకల్పంతో వడివడిగా స్టూడియోలోంచి బయటకు నడిచాడు నేటి యువతరం ప్రతినిధి శ్రీకృష్ణ.
టీవీ చూస్తున్న అపర్ణ శ్రీకృష్ణకి ఫోన్‌ చేసి, 'నువ్వు చేస్తున్న ఈ మంచిపనికి నేను దూరంగా ఉండడం నాకే నచ్చలేదు! నీతో బ్రేకప్‌ చెప్పిన తర్వాత నా మనస్సును నేను ప్రశ్నించుకున్నాను. అది తప్పని తెలిసింది. ఇక నీతోనే జీవితం. నిన్ను వదిలే ప్రసక్తే లేదు!' అంది.
'ఓకే డియర్‌!' అని నవ్వి ఫోన్‌ పెట్టేశాడు.

చాగంటి ప్రసాద్‌
90002 06163