నేేను మట్టి మనిషినే
విరిగిన రెక్కలతో
మొండిగా దేకుతూ
ఒక మొక్క చిగురేస్తే చూసి
నొప్పిని మరచిపోయే
ఒక సగటు మనిషిని
చదును చేసిన నేలపై
చెమట చుక్కలు రాలినాక
పొట్ట పగిలిన విత్తులోంచి
మొక్క తొంగి చూసినప్పుడు
పొట్ట ముక్కచెక్కలయ్యేలా
పగలబడి నవ్వుకున్న
ఒట్టి పిచ్చిమాలోకాన్ని
నేను రైతునే సుమీ
భుజాలు విరుచుకుని
ధాన్యం బస్తాలు మోసినప్పుడు
వెన్ను తట్టిన ఆ చేతులు
అమ్మకానికి పెట్టగానే
రేటు రెక్కల్ని తెంపేస్తుంటే
మౌనంగా నిలబడిపోయిన
ఒట్టి రాతిబండను
వ్యవస్థలో అన్నింటికీ రెక్కలొచ్చి
ఆకాశానికి ఎగిరిపోతుంటే
విలువ పడిపోయిన గింజలు
మూలనపడి ఏడుస్తుంటే
ఓదార్చలేని ఒట్టి అమాయకున్ని
కరువు బండ నెత్తిన పడి
శరీరం ముక్కలవుతున్నా
అరువు కుంపటి నెత్తినెక్కి
జీవితాన్ని బుగ్గి చేస్తున్నా
చిరునవ్వుని
కొన పెదాలపై చిట్లించే
చేయూత కరువైన ఒంటరివాన్ని
నేను రైతునే
పస్తులతో పోరాటం చేస్తూ
ఎండిన గొంతుతో నినాదం చేస్తూ
న్యాయం కోసం అర్రులు చాస్తున్న
మధ్యతరగతి రైతుని నేనే
- నరెద్దుల రాజారెడ్డి
9666016636