పటాసులు నేల మీద నుంచే
ఆకాశం చేరి వెలుగులు
నేలకు వెదజల్లుతాయి!
సుడిగాలి నేల మీద నుంచే
తన విశ్వరూపాన్ని చూపుతుంది!
మినుగురు పురుగు సైతం
నిశీధిని క్షణకాలం పాటు
చిన్న చిన్నిగా వెలిగిస్తుంది!
రెక్కలుకున్న రంగును విదిలిస్తూ
సీతాకోకచిలుక నేల నుండి ఆకాశానికి
రంగులద్దాలనే ప్రయత్నం చేస్తుంది!
నేను నేలమీదనే ఉన్నాను
నా మూలాలు పెనవేసుకున్న బంధుత్వంలో
దూసరతీగలా అల్లుకుపోతున్నాను!
నా గుండెలోతుల్లో దాగుంది
చిక్కటి పాలమీగడలాంటి
మట్టిలో దిద్దుకున్న అక్షరాలు!
నేల మీద ఉన్నది ఏదైనా
మిడిసిపడుతూ నింగికి ఎగిరినా..,
నేలకు చేరక తప్పదు!
నేను.., నా దేహం నేలమీదనే ఉన్నాయి
కానీ...
నా అక్షరాలు ఆకాశంలో చుక్కలు
తారా స్థాయికి చేరిన ప్రతినిధులు
నా అక్షరాలు వెన్నెల కిరణాలు
చీకటికి తోడు నిలిచే నీడలు!
నేల మీదనే ఉంటాను
నేల విడిచి సాము చేయరాదనే సామెతను
నేను నిజంగా నిజం చేస్తాను!!
కుంచెశ్రీ
99088 30477