ఈ కరోనా వచ్చింది మొదలు సంవత్సరం నుంచి స్కూలుకు పోవడం లేదు. నాకేమో స్నాక్స్ తినడం ఇష్టం. 'కరోనా ఉంది.. బయటవేమీ తినొద్దు!' అంటున్నారు అమ్మావాళ్లు. అయితే, మీరే ఏవైనా వెరైటీస్ చేసి పెట్టండి అంటే.. 'మాకు రావు' అన్నారు. అయితే నేనే చేసుకుంటా అన్నాను. ఏదైనా కొత్తవి నేర్చుకుంటానంటే మా ఇంట్లో బాగానే ఎంకరేజ్ చేస్తారు. మొదట కేక్ చేద్దాం అనుకున్నా. యూట్యూబ్‌లో రెసిపీలు చూశా. ఎగ్‌లెస్ కేక్ తయారుచేశా. ఇంట్లోవాళ్ల హెల్ప్ ఉంటుందీ.. రిసిపీ మాత్రం నాదే. వంటకు కావాల్సినవన్నీ అమ్మమ్మే కొనిచ్చేది. ఐస్‌క్రీమ్, శాండ్‌విచ్, బర్గర్, పిజ్జా, పానీపూరీ, దౌలత్, చాక్‌లెట్, కప్‌కేక్స్, పాప్‌కార్న్ ఇలా చాలా చేశా. వారానికి ఒక కొత్త వెరైటీ! ఇంట్లో అందరూ మెచ్చుకుంటుంటే.. మన ఆనందం చెప్పక్కర్లేదు. నేను చేసినవే ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మీకు ఎలా తయారుచేయాలో ఇస్తున్నా. మీరూ ట్రై చేయండే! స్టౌవ్ దగ్గర మాత్రం.. బీ కేర్‌ఫుల్!!
ఎగ్ లెస్ కేక్
కావాల్సిన పదార్థాలు :
మైదాపిండి - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు (పౌడర్ చేసుకోవాలి), బేకింగ్ పౌడర్- రెండున్నర స్పూన్లు, పెరుగు- ముప్పావు కప్పు, నీళ్లు- అర కప్పు, వెన్న- అర కప్పు, వెనీలా ఎసెన్స్ - కొద్దిగా, ఉప్పు - పావు స్పూను.
తయారుచేసే విధానం :
గిన్నె తీసుకుని (కుక్కర్లో పట్టేది) అడుగు తడి లేకుండా తుడిచేయాలి. అడుగుకు నెయ్యి లేదా వెన్న రాసి, కాస్త మైదాపిండి చల్లాలి.
మరో గిన్నె తీసుకుని మైదా, బేకింగ్‌పౌడర్ వేసి, బాగా కలపాలి. అందులో పంచదార పొడి, వెన్న, వెనీలా ఎసెన్సు, నీళ్లు కూడా పోసి, బాగా కలపాలి.
గరిటెతో బాగా కలపాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి. అందులోనే పెరుగు వేసి బాగా కలపాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని ముందుగా వెన్నరాసిన పాత్రలో పోయాలి. ఆ గిన్నెని కుక్కర్లో పెట్టి మూత పెట్టాలి.
కుక్కర్లో నీళ్లు పోయకూడదు. కుక్కర్ మూతకి విజిల్ పెట్టొద్దు.
ముందుగా రెండు నిమిషాలు పెద్దమంట పెట్టాలి. తరువాత తగ్గించి, అరగంట ఉడికించాలి. అంతే ఎగ్‌లెస్ కేకు సిద్ధమైనట్టే.
దహీ శాండ్‌విచ్
కావాల్సిన పదార్థాలు :
పెరుగు- రెండు కప్పులు, మయోనైజ్- పావు కప్పు, బ్రెడ్‌స్లైస్‌లు- రెండు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్‌కార్న్- అన్నీ రెండేసి స్పూన్లు, మిరియాల పొడి- అర టీస్పూన్, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం :
పెరుగును పలుచటి క్లాత్‌లో వేసి, మూటగట్టాలి. దీన్ని రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత గిన్నెలోకి తీసుకుని, మయోనైజ్ వేసి బాగా కలపాలి.
దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్‌కార్న్ వేయాలి.
తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. రెండు బ్రెడ్ స్లైస్‌లు తీసుకుని చివర్లను కత్తిరించాలి.
ఒక బ్రెడ్‌స్లైస్ తీసుకుని, దానిమీద పై మిశ్రమాన్ని వేయాలి. తర్వాత బ్రెడ్‌ను త్రికోణాకారంలో కోసి, ఒకదానిపై మరొకటి పెట్టాలి. అలా రెండో బ్రెడ్‌స్లైస్‌నూ చేసుకోవాలి. అంతే.. వెరీ ఈజీ.
ఫ్రూట్ పంచ్ ఐస్‌క్రీమ్..
కావాల్సిన పదార్థాలు :
బత్తాయి జ్యూస్- కప్పు, ఫైనాఫిల్ జ్యూస్- కప్పు, దానిమ్మ గింజల జ్యూస్- అరకప్పు, వెనీలా ఐస్‌క్రీం- 2 కప్పులు, చెర్రీపండ్లు- 8/10, నిమ్మ సోడా- స్పూను.
తయారుచేసే విధానం :
ముందు ఒక చిన్న బౌల్‌లోకి ఈ జ్యూస్‌లన్నీ పోసి, బాగా కలపాలి.
తర్వాత మూడు జ్యూస్ గ్లాసులను తీసుకోవాలి. వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్‌క్రీం వేయాలి.
ఇప్పుడు జ్యూస్ కొద్దిగా, నిమ్మ సోడా కొద్దిగా పోయాలి. పైన మూడేసి చెర్రీపళ్లతో గార్నిష్ చేయాలి. అంతే ఫ్రూట్ పంచ్ ఐస్‌క్రీమ్ రెడీ..!
దీన్ని ఇలాగే తీసుకోవచ్చు.. లేకపోతే కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, కూల్ కూల్‌గా లాగించేయొచ్చు.
తోటపల్లి సాయిశ్రీజ,
6వ తరగతి,
గుంటూరు ఆక్స్‌ఫర్డ్
ఇంగ్లీషు మీడియం స్కూలు,
ముత్యాలంపాడు,
విజయవాడ.