Jul 23,2023 00:11

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌

ప్రజాశక్తి -నక్కపల్లి:పాఠశాలలు తనిఖీ చేసేందుకు తాను వచ్చినప్పుడు షో చేయద్దని విద్యా వ్యవస్థలో ప్రవీణ్‌ ప్రకాష్‌ మార్క్‌ కనిపించే విధంగా పని చేసి చూపాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. మండలంలోని అమలాపురం లో శనివారం జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌తో కలిసి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసారు. ముందుగా సెమిస్టర్‌ -2కు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఆయనే స్వయంగా విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌లో పుస్తకాలను పెట్టారు. అనంతరం ఆయన విద్యార్థుల నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. హౌం వర్క్‌ సక్రమంగా ఉండటంతో హెచ్‌ఎం నాగేశ్వరరావును అభినందించారు. అదే స్కూల్లో 3,4,5 తరగతి విద్యార్థుల నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థి హౌం వర్క్‌ తప్పు చేసినప్పటికీ ఒప్పు కింద ఉపాధ్యాయుడు రైట్‌ కొట్టడంతో గమనించిన ఆయన ఉపాధ్యాయుడు అప్పలనాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని ,నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువులు అంకితభావంతో పని చేయడం లేదన్నారు. ఆదరాబాదరగా వచ్చి , తిరిగి ఇంటికి వెళ్లి పోవడానికి టైం చూసుకోవడంతో సరి పోతుందని ఉపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును నెల రోజులు సస్పెండ్‌ చేయాలని డిఇఓ వెంకట లక్ష్మమ్మకు ఆదేశించారు.అనంతరం సచివాలయంలో విద్యార్థుల సర్వే యాప్‌కు సంబంధించి నమోదు వివరాలను సచివాలయ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాజయ్యపేటలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. 7వ తరగతి గదిలో వెలుతురు లేకుండా విద్యార్థులు ఉండడంతో లైట్లు లేవా అని అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనుల్లో భాగంగా వైరింగ్‌ పనులు పూర్తి చేయక పోవడంతో నాడు నేడు పనులకు సంబంధించిన అధికారులపై మండిపడ్డారు. ఇప్పటివరకు ఎందుకు వైరింగ్‌ చేయలేదని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఏఈ ప్రసాద్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తొలగించాలని ఆదేశించారు. విద్యార్థుల నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. తప్పులు ఉండడంతో ఆ క్లాస్‌ కు సంబంధించి విద్యార్థుల హౌమ్‌ వర్క్‌ పుస్తకాలను అన్నింటిని క్షుణంగా పరిశీలించి, నివేదిక అందజేయాలని డిఈఓకు సూచించారు .విద్యార్థుల నుండి డిఇఓ పుస్తకాలు సేకరించి తీసుకువెళ్లారు.డీఈవో వెంకట లక్ష్మమ్మ ,ఎంఈఓ నరేష్‌ తో కొంతసేపు ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. కార్పొరేట్‌ పాఠశాల కన్నా నేడు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సమకూరుస్తున్నప్పటికీ లోపాల నుండి బయటపడక పోవడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు .తను పాఠశాలలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే లోపాలన్నీ బయటపడుతున్నాయని ,డీఈవో, ఎంఈఓ తనిఖీలు చేసినప్పుడు లోపాలు ఎందుకు బయటపడటం లేదని ప్రశ్నించారు.భయపడుతూ పని చేయకూడదని, ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వహిస్తూ ,తనను ఆదర్శంగా తీసుకుని పాఠశాలలు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు .జాబ్‌ కార్డ్‌ పక్కగా ఉండే విధంగా చూడాలని ,లోపాలకు చెక్‌ పెట్టాలని సూచించారు .అనంతరం నక్కపల్లిలో జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్‌ బుక్స్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆర్‌ జెడి జ్యోతి కుమారి, ఆర్‌డిఓ జయరాం, తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈఓపిఆర్డి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను ఆకస్మిక తనిఖీ
ఎస్‌.రాయవరం:మండలంలోని రేవుపోలవరం ప్రాధమిక పాఠశాలను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలను పరిశీలించిన ఆయన తప్పుడు సమాధానాలకు కూడా రైట్‌ మార్కులు వేసిన ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే సహించబోనని హెచ్చరించారు.ప్రత్యేక తరగతులపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావును ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి, రీజనల్‌ జాయింట్‌ సెక్రటరీ జ్యోతి కుమారి, జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకట మహాలక్ష్మమ్మ, సమగ్ర శిక్షణాధికారులు శకుంతల, ఆర్డివో జయరామ్‌,తహసీల్దార్‌ విజరు కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్యామ్‌ కుమార్‌, ఎంపిడివో రామచంద్ర మూర్తి, ఎంఈవోలు అప్పారావు మూర్తి ఇంజనీరింగ్‌ ఏఈ, డిఈలు పాల్గొన్నారు.