ప్రజాశక్తి - చిలకలూరిపేట : మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష కౌన్సిలర్లు రుజువుల్లేని ఆరోపణలు చేయడం సరికాదని మున్సిపల్ చైర్మన్ ఎస్.కె.రఫానీ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జనన, మరణ ధ్రువపత్రాలు విషయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారని, అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంటే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చెత్త పన్నులో రశీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారికెవరైనా ఫిర్యాదు చేశారా? అని అన్నారు. రిజిస్ట్రేషన్‌లో ఒక్కో ఇంటికి రూ.300 వసూలు చేసినట్లు ఆరోపించారని, అయితే అందులో రూ.200 రిజిస్ట్రేషన్ యూజర్ చార్జీల కింద ఖర్చు పెట్టాల్సి ఉందనే విషయం వారు గుర్తించాలన్నారు. అమృత పథకంలో రూ.90 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, మున్సిపాలిటీకి నెలకు రూ.7-8 కోట్లకంటే ఎక్కువ వసూలు కావడం లేదని, అందులో జీతాలు, ఇతర ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అమృథ పథకంతో మున్సిపాల్టీకి సంబంధం లేదని, ప్రజారోగ్య శాఖకు చెందిందని, అందులోనూ రూ.30 కోట్లకు గాను రూ.16 కోట్ల వచ్చాయని, ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయని చెప్పారు. తానేమీ అవినీతికి పాల్పడ్డం లేదని, ఒకవేళ ప్రతిపక్ష కౌన్సిలర్ల వద్ద ఆధారాలుంటే నిరూపించాలని అన్నారు.










