ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ పరిధి నేలజర్త గ్రామంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో మూడు రోజుల నుండి మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. ఏడాదికి పైగా మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు, వంట చేసే వర్కర్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో ఆమె వంట గదికి తాళం వేసి తన నిరసన తెలిపింది. దీనికి సంబంధించి స్కూల్ కమిటీ చైర్మన్ కొర్ర అప్పారావు, గ్రామస్తులు మార్కు రాజు తెలిపిన వివరాల ప్రకారం....
నేలజర్త ఎంపీపీ స్కూల్లో 54 మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి కిమిడు అమ్మోజీ అనే వర్కర్ క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనం వండి పెడుతోంది. అయితే 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అంటే 14 నెలలకు పైగా మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, వర్కర్‌కు జీతం ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లులు, జీతం చెల్లించాలని అమ్మాజీ అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. విసిగిపోయిన, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమ్మాజీ బుధవారం వంటగదికి తాళం వేసింది. దీంతో బుధవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. ఈ విషయంపై జీకే వీధి ఎంఈఓ చంద్రశేఖర్‌ను కలిసేందుకు గ్రామస్తులు, వర్కరు అమ్మాజీ వెళ్లగా ఆయన కార్యాలయంలో లేరు. దీంతో ఆయనకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయగా, 'నేను కార్యాలయంలో లేను. వేరే ఊరు వెళ్లాను. ఆఫీసులో ఫిర్యాదు చేయండి' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టలేదని ఫిర్యాదు చేస్తే వర్కరుకు నచ్చజెప్పి భోజనం వండి పెట్టించే ఏర్పాటు చేయాల్సిన ఎంఇఒ తనకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు, వర్కరు జీతం చెల్లించలేని దుస్థితిలో ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టకుంటే శనివారం నుంచి తమ పిల్లల్ని బడికి పంపించకుండా పూర్తిస్థాయిలో నిలిపివేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు. ఇప్పటికైనా ఎంఈఓ చంద్రశేఖర్, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బిల్లులు, వర్కర్ జీతం చెల్లించి, మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.










