ప్రజాశక్తి హుకుంపేట:విద్యుత్ స్తంభం పడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థి తూబూరు ధన్విత (6) మృతి చెందిన ఘటన మండలంలోని తాడేపూట్టు పంచాయతీ ఉర్రాడ బొడ్డపుట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐబి సతీష్ కథనం మేరకు..ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో తుప్పు పట్టిన జీర్గ చెట్టు విరిగి పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. అందులో పాఠశాల ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంభం పడిపోవడంతో ఆరు బయట విద్యభ్యాసిస్తున్న నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి తూబూరు.ధన్విత (6) గుండెకు బలమైన దెబ్బ తగిలింది. హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో మృతి చెందిందినట్లు ఎస్సై తెలిపారు.
తల్లిదండ్రులు బంధువులు ఆందోళన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరు బయట విద్య బోధన నిర్వహిస్తుండటంతో తమ పాప మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో విద్యుత్ స్తంభాలు తొలగించాలంటూ పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. మృతికి కారకులైన ఉపాధ్యాయులకు వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించాలని గిరిజన సంఘం, మానవ హక్కుల విద్య బోధన, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు.










