ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ముచ్చర్ల గ్రామానికి చెందిన షినగం రావాలయ్య (41), అతని చిన్నాన్న అప్పారావు కలిసి ఉదయం ఐదు గంటలకు లోతుమడి వద్ద వరి మడి తయారుచేసేందుకు పొలంలోకి వెళ్లారు. సుమారు 6:30 గంటల సమయంలో లోతుమడి వద్ద గల నేలబావిలో నీటి కోసం వెళ్లి కాలుజారి పడిపోయి మృతిచెందాడు. మృతుని భార్య షినగం సత్యవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఆనందపురం సిఐ రామచంద్రరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ నరసింహమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
షినగం రావాలయ్య, సత్యవతి దంపతులకు కుమార్తె మౌనిక, కుమారుడు మణికంఠ (16) ఉన్నారు. దంపతులిద్దరూ స్థానికంగా ఉన్న కోళ్ల ఫారంలో పనులు చేసుకుంటూ మిగతా సమయంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










