కడప ప్రతినిధి జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, డివైఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, పిడిఎస్‌ఒ వంటి విద్యార్థి సంఘాల నాయకత్వాలు ఉమ్మడిగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నరీతిలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్ర మను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రాన్ని నిలదీసి విభజన చట్టంలోని హక్కులన్నింటినీ సాధించుకోవాలని కోరుతున్నాయి. విద్యార్థి సంఘాలు మొదలుకుని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా నినదిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవడంలో ఉమ్మడిగా వ్యవ హరించాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. కానీ రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్షాలకు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధన కంటే వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి హక్కులను బలిపెడుతున్న వైనంలో అభ్యుదయ విద్యార్థి సంఘాల నాయకత్వాలు గళమెత్తాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు యోగి వేమన యూనివర్శిటీలో బిఇడి సెకెండ్ సెమిష్టర్ పరీక్షను వాయిదా వేయాలనే అభ్యర్థన మేరకు వాయిదా వేయడం గమనార్హం. ఇటువంటి పరిస్థి తుల నేపథ్యంలో 2014, 2019లో అధికారం చేపట్టిన టిడిపి, వైసిపిలు తమ పాలనా కాలం ముగింపు దశలో నటించడం పరిపాటిగా మారింది. ఇటువంటి నిర్లక్ష్య పాలకులు ప్రయివేటు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి శిలాఫలాకాలు వేయడం, వాటిని మరోచోటికి మార్చడం వంటి నటనలతో కాలం వెళ్లదీస్తున్న నేపథ్యంలో విధ్యార్థి సంఘాలు జిల్లా బంద్‌ను తల పెట్టడం గమనార్హం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలను అమలు చేయడం, ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి రాష్ట్రాభివృద్ధి దోహద పడాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్రాల్లోని పాలకులు విఫలమైన సమయాల్లో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు స్పందించాల్సిన అవసరంలో భాగంగానే బంద్‌ను అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పవచ్చు.