Apr 13,2023 00:18

ప్రజాశక్తి - యడ్లపాడు : తుమ్మలపాలెం అమరవీరుల స్మారక సభ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తుమ్మలపాలెం అమరవీరుల స్మారక ట్రస్టు తెలిసింది. ఈ మేరకు ట్రస్టు కన్వీనర్‌ చెరుకూరి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దన్నుగా ఆంధ్రప్రాంతంలో జరిగిన పోరాటంలో మరణించిన ఆరుగురు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ క్రూరత్వానికి బలైన మరో 17 మంది, శ్రీకాకుళంలో గిరిజన ఉద్యమానికి బాసటగా నిలిచిన అమరులైన జిల్లాకు చెందిన మరో 10 మంది స్మృత్యర్థం తుమ్మలపాలెంలో అమరవీరుల స్తూపాలను నిర్మించారు. 1997లో వీటిని పునర్‌నిర్మించి అన్ని కమ్యూనిస్టూ పార్టీలూ కలిసి స్మారక సభను ప్రతిఏటా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తుమ్మలపాలెంలోని అమర్‌నగర్‌లో గురువారం నిర్వహించే సభకు ముఖ్య ఉపన్యాసకులుగా సిపిఎం, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శులు గుంటూరు విజరుకుమార్‌, ఎ.మారుతి వరప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌బాబు, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి హాజరవుతారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.