
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నేడు చారిత్రక రాజమ హేంద్రవరం వేది కగా జరగనుంది. నగరంలోని హోటల్ మంజీరాలో సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు ఇరు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. స్కిల్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్నాయని ఇదే రాజమహేంద్రవరం నుంచి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచిన తూర్పు గోదావరి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ, సీట్ల కేటాయింపులు, అధికార వైసిపిని ఏవిధంగా ఎదుర్కొనాలనే అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా రాజమహేంద్రవరంలోనే ప్రారంభించనున్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయం చేసుకుని ఉమ్మడి అజెండాతో కలిసి వెళ్లేందుకు రేపటి సమావేశం తొలి అడుగు పడ నుంది. నేడు జరిగే ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమా వేశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే పార్టీ అధినేతల రాక నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు జనసేన, టిడిపి శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. మరోవైపు చంద్రబాబును మరో సారి పవన్ కళ్యాణ్ ములాఖత్ ద్వారా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా సెలవు దినం మంగళ వారానికి వాయిదా వేయటంతో సోమవారం యథా విధిగా సెంట్రల్ జైలు కార్యకలాపాలు జరగనున్నాయి. కీలక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబును కలిసి చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. ఇదిలావుంటే టిడిపి, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి వేదిక అయిన మంజీర కన్వెన్షన్ సెంటర్‌ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, ఇతర నాయకులు ఆదివారం పరిశీలించారు. వేదిక వద్ద చేస్తున్న ఏర్పాట్లపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.