ప్రజాశక్తి -సామర్లకోట రూరల్
సిఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గురువారం సిఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరుజైన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, హౌసింగ్ జెఎండీ శివప్రసాద్, ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్, జెసి ఎస్.ఇలాక్కియాలతో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్య మంత్రి కాన్వారుకి సంబంధించిన ట్రైల్ రన్‌ను నిర్వహించారు. పేదల సొంతింటి కల సాకారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని గురువారం సామర్లకోటలో ముఖ్యమంత్రి ప్రారంభించను న్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి పి.శ్రీనివాసు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా పరిషత్ సిఇఒ ఎ.రమణారెడ్డి, ఆర్‌డిఒలు ఎన్‌వివి.సత్యనారాయణ, జె.సీతా రామరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ట్రాఫిక్‌పై ఆంక్షలు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌పై పలు ఆంక్షలు విధించారు. కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు పెద్దాపురం డిఎస్‌పి లతా కుమారి తెలిపారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వైపునకు వచ్చే భారీ వాహనాలన్నీ అచ్చంపేట జంక్షన్ నుంచి తిమ్మాపురం, పిఠాపురం బైపాస్ మీదుగా కత్తిపూడి హైవేకు దారి మళ్లించా మన్నారు. కాకినాడ, మాధవపట్నం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఉండూరు బ్రిడ్జి డౌన్ జంక్షన్ నుండి అచ్చంపేట బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించామన్నారు. సామర్లకోట అయిదు తూముల సెంటర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటాఫ్ పెట్టుకుని ఉండూరు వైపు నుంచి వచ్చే వాహనాలను మాధవపట్నం వైపునకు మళి ్లస్తున్నట్టు తెలిపారు. బిక్కవోలు, అనపర్తి వైపు నుంచి సామర్లకోట వైపుకు వచ్చే భారీ వాహ నాలన్నీ బిక్కవోలు, భలభద్రపురం మీదుగా మళ్లించామన్నారు. రాజానగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు పెద్దాపురం పాండవుల మెట్ట నుంచి గుర్రాల సెంటర్ మీదుగా జగ్గంపేట హైవేకు, ఆర్‌టిసి బస్సులు సామర్లకోట బస్టాండ్‌కు వచ్చి తిరిగి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పెద్దాపురం ఎడిబి రోడ్డు మీదుగా వెళ్తాయన్నారు. జగ్గంపేట నుంచి వచ్చే వాహనాలు ఎడిబి రోడ్డు మీదుగా కాకినాడ వైపునకు మళ్లించా మన్నారు. ప్రత్తిపాడు నుండి కాకినాడ వెళ్ళే వాహనాలు దివిలి మీదుగా కాకినాడ వైపునకు మళ్లుతాయన్నారు. కాకినాడ, కత్తిపూడి నుండి వచ్చే వాహనాలు సామర్లకోట వైపునకు రాకుండా తిమ్మాపురం, వై.జంక్షన్ నుంచి మళ్లించామన్నారు. రాజానగరం, రంగంపేట వైపు నుంచి కాకినాడ వచ్చే భారీ వాహనాలను జగ్గంపేట, కత్తిపూడి మీదుగా దారి మళ్ళించినట్టు తెలిపారు. భలభద్రపురం నుంచి సామర్లకోట వైపు వచ్చే భారీ వాహనాలను అనపర్తి, మండపేట నుంచి కాకినాడ వైపునకు మళ్లించామన్నారు.
పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు
పెద్దాపురం రోడ్డులోని స్వర్ణ దేవాలయం వద్ద, పెద్దాపురం సుధా ఆయిల్ మిల్లు చెంతన హీరో షో రూమ్ పక్కన గల ఖాళీ ప్రదేశంలోనూ, జి.రాగంపేట గ్రామం గణేష్ కాలనీ పిల్లి సూరిబాబు లే ఔట్ వద్ద వాహనాలకు పార్కింగ్ ప్రాంతాలుగా కేటాయించామన్నారు. ఆటోలకు సామర్లకోట టిటిడిసి శిక్షణ కేంద్రంలో, పిఠాపురం రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా, సామర్లకోట ఇండిస్టియల్ ఎస్టేట్ వద్ద పార్క్ చేసుకోవాలన్నారు.










