
* బస్సు యాత్రను విజయవంతం చేయండి
* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - నరసన్నపేట: వైసిపి చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశలో భాగంగా ఈనెల 15వ తేదీన నరసన్నపేటలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమంతో ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న చర్యలు, చేసిన మంచిని ఈ యాత్రలో వివరించనున్నట్లు తెలిపారు. 15న మధ్యాహ్నం 12 గంటలకు పోలాకి మండలంలోని మబగాం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మధ్యాహ్న భోజన విరామం అనంతరం 1.30 గంటలకు మబగాం నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర బయలుదేరుతుందన్నారు. మబగాం, కిల్లాం, ఈదులవలస, ఈదులవలస జంక్షన్, చల్లబంద జంక్షన్, దేశవానిపేట, పల్లిపేట జంక్షన్ మీదుగా నరసన్నపేట వైఎస్సార్ కూడలికి బస్సు యాత్ర చేరుకుంటుందని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నరసన్నపేట పట్టణంలో సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు జిల్లా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.