Jun 22,2023 00:50

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విసి తదితరులు

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం, శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామని విసి ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు వివరాలను వర్సిటీలో బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల నుండి ప్రతినిధులు హాజరవుతారని, విశిష్ట రంగాలలోని 100కు పైగా సంస్థలకు, కార్యాలయాలకు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. 10 వేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలలోని విద్యార్థులూ హాజరవ్వొచ్చని, యూజీ, పీజీ, ఐటీ, బీటెక్‌, ఎంసిఎ, ఎంబిఎ, విద్యార్హతగా కలిగిన వారికి ఈ జాబ్‌మేళా సువర్ణావకాశమని చెప్పారు. ఐటి, ఐటిఇఎస్‌, బిపిఒ, కెపిఒ, ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, మొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఎలక్ట్రికల్స్‌, రీటైల్‌ ఇండిస్టీస్‌, బ్యాంకింగ్‌, ఎన్‌బిఎఫ్‌సి, టెలికామ్‌, ఇన్సూరెన్స్‌, మెడికల్‌, ఫార్మా వంటి రంగాల నుండి ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ మెగా జాబ్‌ మేళా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.సిద్ధయ్య, ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఇ.శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్‌ జి.అనిత పాల్గొన్నారు.