Nov 18,2022 22:26

ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన నేతలు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

             కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా.. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం ఉద్యమించే సిఐటియు ఏలూరు జిల్లా 12వ మహాసభ ఈ నెల 19, 20వ తేదీల్లో ఏలూరులో జరగనుంది. ఈ మహాసభ నిర్వహణకు సర్వంసిద్ధమైంది. శనివారం ఉదయం పదిగంటలకు ఆర్‌ఆర్‌పేటలోని కాశీవిశ్వేశ్వర కల్యాణ మండపంలో ప్రారంభమయ్యే మహాసభకు ముఖ్య అతిధులుగా ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కె.స్వరూపరాణి, ఆర్‌వి.నరసింహారావుతోపాటు ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు ఆర్‌ఎస్‌.హరనాధ్‌, చోడగిరి శ్రీనివాస్‌, వివిధ సంఘాల నాయకులు రమేష్‌కుమార్‌, ఎల్‌వి.సాగర్‌ హాజరుకానున్నారు.
2019 డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో తాడేపల్లిగూడెంలో 11వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ఈ మహాసభను ఏలూరులో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వారి హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కార్మికుల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో తిరిగి కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి వేతనాలు పెంచాలనే దానిపై చేపట్టే ఉద్యమాలపైనా చర్చించనున్నారు. వీటితోపాటు మూడేళ్ల కాలంలో కార్మికుల సమస్యలపై చేపట్టిన ఉద్యమాలపైనా, వాటి ఫలితాలపైనా కూడా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా వలస కార్మికులకు ఆహారాన్ని అందించారు. మున్సిపల్‌, ఇతర కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు 300 మందిని కరోనా బారి నుంచి కాపాడారు. 2019 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మూడుసార్లు నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెల్లో జిల్లాలోని సిఐటియు నాయకులు తమదైన రీతిలో కీలకభూమిక పోషించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలోనూ జిల్లా నేతలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల్లో, రైతాంగ, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఉద్యమాల్లో కొన్ని..
ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్‌ కెమికల్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మరణించారు. ఆ కార్మికులకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆందోళన చేయగా రూ.50 లక్షలు ప్రకటించారు. లక్కవరం రైతు డెయిరీ పరిశ్రమలో ప్రమాదం జరిగి మహిళా కార్మికురాలు చనిపోయారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి వద్ద సిఐటియుగా ఆందోళన నిర్వహించి రూ.8 లక్షలు పరిహారం ఇప్పించారు. వర్మన్‌ కాంపెన్షన్‌ కింద ఫిర్యాదు చేసి మరో రూ.7.60 లక్షలు కార్మికురాలి కుటుంబానికి ఇప్పించారు. భీమడోలు ప్రాంతంలోని నాగహనుమాన్‌ పరిశ్రమ, తిరుమల డెయిరీ, సగ్గొండ ఆంధ్రా షుగర్స్‌, తాళ్లపూడిలో రైస్‌మిల్లు కార్మికుడు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరణించిన కార్మికులకు సిఐటియు ఆందోళనల ఫలితంగా నష్టపరిహారం అందింది. రుద్ర టెక్నోఫీడ్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికుడు కాలు కోల్పోతే ఆందోళన చేసి నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నించారు. నూజివీడు శ్రీనివాస ఫీడ్‌ ప్లాంట్లో ప్రమాదం జరిగి కార్మికుడు చనిపోతే ఆందోళన చేసి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇప్పించారు. ద్వారకాతిరుమల దేవస్థానంలో కాంట్రాక్ట్‌ కార్మికురాలు క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురైతే కాంట్రాక్టర్‌తో మాట్లాడి రూ.1.50 లక్షల సాయం అందించారు. ఇలా ఎన్నో విజయాలు సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడేళ్లకాలంలోనే ఎన్నో పోరాటాలు, మరెన్నో విజయాలు సాధించారు. ప్రస్తుతం జిల్లాలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నారు. రానున్న మూడేళ్లలో చేపట్టాల్సిన ఉద్యమాల ప్రణాళికకు రూపకల్పన చేయనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.సోమయ్య, డిఎన్‌విడి.ప్రసాద్‌ తెలిపారు.