Dec 02,2022 23:45

మాట్లాడుతున్న డిఆర్‌్‌ఒ దయానిధి

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని 1008 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 3,4 తేదీల్లో ప్రత్యేక కాంపెయిన్‌ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ, బిఎల్‌ఓలు ఓటర్ల జాబితాలతో ఉదయం 8 గంటలు నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పక హాజరై ఓటరు నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని డిఆర్‌ఓ కోరారు. ముసాయిదా ప్రచురణ చేసిన తరువాత చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఓటర్ల వివరాల్లో సవరణకు అందిన క్లెయిమ్‌ దరఖాస్తుల వివరాల జాబితాను వివిధ రాజకీయ ప్రతినిదులకు అందజేయడం జరిగిందన్నారు. యువ ఓటర్లు, ముఖ్యంగా ఆదిమ తెగనివాసం ఉండే ఆవాసాలలో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వారందరి పేర్లు నూరు శాతం ఓటర్ల జాబితాలో నమోదు అయ్యే విధంగా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితాల్లో డెత్‌ కేసులు, షిప్టెడ్‌ కేసులు, డబల్‌ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని సవరించాలని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, 26వ తేదీలోపు పరిష్కరించి తుది జాబితా జనవరి 05న విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైసిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్‌ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.