Nov 03,2023 22:20

నేడు, రేపు ప్రజా సమస్యలపై 'భేరి' చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సభలు

నేడు, రేపు ప్రజా సమస్యలపై 'భేరి'
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సభలు
అన్నమయ్య జిల్లా నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు శివారుల్లోకి యాత్ర ప్రవేశించనుంది. అక్కడనుంచి ఉదయం 11 గంటలకు బంగారుపాళ్యం, 12 గంటలకు చిత్తూరుల్లో బహిరంగసభలు ఉంటాయి. చిత్తూరు నుంచి తిరుపతి జిల్లా పాకాలలో ప్రవేశించే బస్సు యాత్రకు సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ స్వాగతం పలకనుంది. అక్కడనుంచి చంద్రగిరి మీదుగా సాయంత్రం 4 గంటలకు తిరుచానూరులో సభ ఉంటుందని, 5 గంటలకు తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆదివారం రేణిగుంట, శ్రీకాళహస్తిల్లో సభలు జరగనున్నాయి.
రాష్ట్ర జాతా ప్రధాన నాయకత్వం వీరే...
కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ నాయకత్వం వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర నాయకులు వి.క్రిష్ణయ్య, ఉమామహేశ్వరరావు, రాంభూపాల్‌, భాస్కరయ్య, దయా రమాదేవి, శివనాగరాణి ఉంటారు. 5న ఆదివారం ఉదయం 9 గంటలకు రేణిగుంటలో జాతా కొనసాగింపు ఉంటుంది. ఉదయం 11 గంటలకు శ్రీకాళహస్తిలో సభ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు గూడూరు జంక్షన్‌లో బహిరంగసభ ఉంటుందని, అక్కడనుంచి బస్సు యాత్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చేరుకుంటుందని వివరించారు.
అధికారం కోసం వైసిపి, టిడిపి, జనసేన, బిజెపిలు ఈ రాష్ట్రంలో కుర్చీల యాత్ర చేపడుతుంటే, సిపిఎం ప్రజా సమస్యలపై 'ప్రజారక్షణ' పేరుతో బస్సు యాత్ర చేపట్టిందని తిరుపతి, చిత్తూరు జిల్లాల సిపిఎం జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, వాడ గంగరాజు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వైసిపి సమస్యలపై ప్రశ్నిస్తే నిర్బంధాలు, దౌర్జన్యాలు, కేసులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజా రక్షణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం నేతృత్వంలో మూడు యాత్రలను ప్రారంభించారని, కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చే బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో పర్యటించి శనివారం ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లా పలమనేరు శివారుల్లో ప్రవేశిస్తుంది. ఈ యాత్రలో ప్రజా సమస్యలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ ఉంటుందని తెలిపారు. ప్రజలు విశేషంగా పాల్గొని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బస్సు యాత్రలో వస్తున్న నాయకత్వానికి సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేయాలని కోరారు.

(ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో )
చిత్తూరు జిల్లా ప్రధాన సమస్యలివే..
పలమనేరు - బెంగుళూరు హైవేలో భారీ టెక్స్‌టైల్‌ పరిశ్రమలు నిర్మించి పదివేల మందికి ఉపాధి కల్పిస్తాం. జగన్మోహన్‌రెడ్డి పునాదిరాయి కూడా వేయలేదు.
పట్టు పరిశ్రమను ఆదుకునేందుకు ప్రోత్సాహక రుణంగా 2 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ప్రకటించలేదు.
కుప్పం వరకూ హంద్రీనీవా కాల్వ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
జీడీనెల్లూరు, గంగవరం, చిత్తూరులలో పారిశ్రామికవాడలను నిర్మిస్తామని ఎపిఐఐసికి భూములు అప్పగించి నాలుగేళ్లవుతున్నా ఒక్క పరిశ్రమ రాలేదు. భూములు బీడుగానే ఉన్నాయి. గంగవరంలో ఒకట్రెండు మాత్రమే వచ్చాయి.
చిత్తూరు జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు హామీగానే మిగిలిపోయింది.
జిల్లాకు విభజన జరగడంతో ఇఎస్‌ఐ ఆస్పత్రి చిత్తూరులో లేదు. వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని కార్మికులు కోరుతున్నారు.
అధికారంలోకి వస్తానే చిత్తూరు విజయ డెయిరీని పున్ణప్రారంభిస్తామని చెప్పి 99 ఏళ్లు గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టారు.
బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో కోల్డ్‌స్టోరేజి ఏర్పాటు చేసి మామిడి, టమోటా రైతులను ఆదుకుంటామని చెప్పారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా మొత్తం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పశువుల మేత కరువయ్యింది. కేవలం మూడు మండలాలకే కరువు మండలాలుగా ప్రకటించారు. సమగ్ర సర్వే చేసి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
తిరుపతి జిల్లా హామీలు
తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధులు ఒక్కశాతం ఇస్తామని బోర్డు తీర్మానం చేసింది. బిజెపికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
దుగ్గరాజపట్నం పోర్టు అనుమతులు ఇవ్వకుండా పనులు ఆపేయడమే కాకుండా, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
మన్నవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రత్యక్షంగా ఆరువేలు, పరోక్షంగా 20వేలకు ఉపాధి నీటి మూటయ్యింది.
టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఫారెస్టు కార్మికులను తాము అధికారంలోకి వస్తానే రెగ్యులర్‌ చేస్తామని చెప్పి గాలికొదిలేశారు.
తిరుపతి విద్య, వైద్యం అభివృద్ధికి, నగరాభివృద్ధికి బిజెపి అడుగడుగునా మోకాలడ్డుతోంది.
జగనన్న ఇళ్లు 2 లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ ఒక్క కాలనీ నిర్మాణమైనా పూర్తయిన దాఖలా లేదు.
ఎస్‌ఎస్‌ కెనాల్‌ను, తెలుగుగంగ, గాలేరు నగరిని గాలికొదిలేశారు.
సిఆర్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి వేలాది మందికి ఉద్యోగాలిస్తామని కేంద్రం చెప్పింది. కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించుకుపోయేందుకు రంగం సిద్ధమయ్యింది.
తిరుపతి జిల్లాలో వచ్చిన ప్రైవేట్‌ ఫ్యాక్టరీల్లో స్థానికులకు 70శాతం ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వ జీవో అమలుకు నోచుకోలేదు.
మరమగ్గం కార్మికులకు విద్యుత్‌ డ్యూటీ ఛార్జీలు ఎత్తివేస్తామని సిఎం ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు.
గూడూరు, నగరి, వెంకటగిరి ప్రాంతాల్లో విద్యుత్‌ బిల్లులు కట్టలేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
గూడూరులో నిమ్మకాయల మార్కెట్‌ ఉన్నా గిట్టుబాటు ధర లేదు.
సిలికాన్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసి రైతులపై దౌర్జన్యం చేయడం పరిపాటయ్యింది.ప్రభుత్వమే సిలికాన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకే. ఒక్క విమానమైనా అంతర్జాతీయంగా ఎగిరుంటే ఒట్టు.
నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నత్తనడకన నడుస్తోంది.
తిరుపతి జిల్లాలో వర్షాభావంతో రైతులు పంటలు పండించుకోకుండా 'క్రాప్‌ హాలిడే' ప్రకటించారు. సమగ్ర సర్వే చేపట్టి కరువు మండలాలను ప్రకటించాలి.