నేడు, రేపు ఓటరు నమోదు, సవరణకు అవకాశం : ఆర్డీవో
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2024 మేరకు ఎన్నికల కమిషన్ గత మాసం తేది 27 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఈనెల 4,5 తేదీల్లో శని,ఆది వారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి చంద్రగిరి నియోజక వర్గం పరిధిలో 395 పోలింగ్ కేంద్రాల్లో జాబితా అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని చంద్రగిరి ఇ ఆర్ ఓ, తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు ఓటర్లు 3,00,940 మంది, సర్వీస్ ఓటర్లు 410 వున్నారని ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ప్రత్యేకంగా ఈ నెల 4,5 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు బి ఎల్ ఓ లు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని అన్నారు. ఓటరు నమోదు , సవరణలకు, తొలగింపులకు సంబంధించిన ఫారమ్స్ 6, 6ఎ, 7, 8 అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గం లోని ఓటర్లు తప్పనిసరి జాబితా సరిచుసుకోవాలని, రానున్న జనవరి 2024 కు 18 సంవత్సరాల వయస్సు నిండిఉ న్నవారు తప్పనిసరి ఓటు నమోదు చేసుకోవాలని, యువ ఓటర్లు కీలకమని సూచించారు.
ఓటర్ల జాబితా లో పేర్లు సరిచూసుకునేందుకు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, ఈ నెల 4, 5 తేదీల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించనున్నామని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి హరిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ ప్రజలు తమ యొక్క ఓటు ను జాబితాలో తెలుసుకోవడానికి మార్పులు చేసుకోవడానికి సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (బి ఎల్ ఓ) 167-తిరుపతి నియోజక వర్గ పరిధి లో ఉన్న 267 పోలింగ్ కేంద్రాలలో శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటారని తెలిపారు.18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు కొరకు ఫారం-6 ను ఓటర్ హెల్ఫ్లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.










