ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ శని, ఆదివారాల్లో మండలంలోని ధూళిపాళ్ల లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ సిహెచ్.పావని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కమిటీ సమావేశం సత్తెనపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ దేశంగాని, రాష్ట్రం గాని అభివృద్ధి చెందాలంటే అందుకు ప్రధానం సాధనం విద్యన్నారు. అయితే విద్యను ప్రైవేటు పరం చేసి పేదలకు, బాలికలకు విద్యను దూరం చేస్తున్నారని ప్రభుత్వాలను విమర్శించారు. రాష్ట్రంలో చదువుకునే అమ్మాయిల సంఖ్య తగ్గిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. బాలికల సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. శానిటరీ ప్యాడ్స్ పైన 6 జీఎస్టీ రద్దు చేయాలని, హాస్టల్స్‌లో విద్యార్థినునలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో గోవుకు ఉన్న రక్షణ స్త్రీకి లేదని, మహిళా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. బాలిక విద్యాభివృద్ధి, విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌లో చర్చిస్తామని, భవిష్యత్ కర్తవ్యాలను నిర్ణయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా గర్ల్స్ కన్వీనర్ కె.నవిత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సాయికుమార్, ఉపాధ్యక్షులు అమూల్య, రమాదేవి పాల్గొన్నారు.










