Feb 19,2023 21:46

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

నేడు రాష్ట్ర గవర్నర్‌ శ్రీశైలం రాక
- పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయండి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - శ్రీశైలం

      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ నేడు సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం విచ్చేస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీశైలం దేవస్థానంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌ రాక సందర్భంగా సున్నిపెంట హెలిప్యాడ్‌ మైదానాన్ని సిద్ధం చేసి చుట్టూ బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్‌ స్ప్రింక్లింగ్‌ చేయాలని ఆర్‌అండ్‌బి, అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు. కాన్వారు వెంట 15 వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ అతిథి గృహంలో ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు వసతి, అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లు చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారికి సూచించారు. కాన్వారు వెంట, దేవస్థాన పరిధిలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందితో సహ సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక సిబ్బందిని ఆదేశించారు. హెలిప్యాడ్‌ సమీపంలో మెడికల్‌ క్యాంప్‌, అంబులెన్స్‌, కార్డియాలజిస్ట్‌తో పాటు నైపుణ్యం గల డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని డిఎంఅండ్‌హెచ్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌, నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డ్యూటీ పాసులు మంజూరు చేయాలని ఆర్‌డిఒ ఎం.దాసుకు సూచించారు. రాష్ట్ర గవర్నరు పర్యటించే ప్రదేశాలలో పారిశుధ్య పనులు చేపట్టాలని డిపిఒను ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హెలిప్యాడ్‌ సమీపంలో ప్రముఖులకు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ఆదేశించారు. కాన్వారులో ఉన్న వాహనాలకు, డ్యూటీ అధికారులకు ఆహార పదార్థాల పాకెట్లను అందజేయాలని సివిల్‌ సప్లై అధికారులకు సూచించారు. దేవస్థానంలో సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర గవర్నర్‌కు భ్రమరాంబామల్లికార్జున స్వామి వార్ల దర్శనాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇఒను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ పుల్లయ్య, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, ఇఒ ఎస్‌.లవన్న, ఆత్మకూరు ఆర్డీఓ ఎం.దాసు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్‌పి
నేడు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ శ్రీశైల పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, జిల్లా ఎస్‌పి కె. రఘువీర్‌ రెడ్డిలు పరిశీలించారు. సున్నిపెంట హెలిప్యాడ్‌ మైదానాన్ని పరిశీలించారు. సున్నిపెంట్‌ హెలిప్యాడ్‌ మైదానం నుండి మాక్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తూ మార్గమధ్యలో పారిశుధ్య చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజల కార్యక్రమాలపై ఇఒతో చర్చించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, గవర్నర్‌ ప్రోటోకాల్‌ అధికారి ఉదయరాజు, దేవస్థానం ఇఒ ఎస్‌.లవన్న, ఆత్మకూరు ఆర్‌డిఒ ఎం.దాసు, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ సుబ్బారెడ్డి, డిఆర్‌డిఏ పీడి శ్రీధరరెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ పర్యటన వివరాలు..
రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ నేడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం 8 గంటలకు రాజ్‌ భవన్‌ నుండి బయలుదేరి 8:20 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. 9:40 నిమిషాలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9:50 నిమిషాలకు సున్నిపెంట హెలిప్యాడ్‌ నుండి బయలుదేరి 10:10 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిధి గృహానికి చేరుకుంటారు. 10:25 నిమిషాల నుండి 11 గంటల వరకు క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించుకుని తిరిగి బ్రమరాంబ అతిధి గృహానికి చేరుకుంటారు. 11:40 నిమిషాలకు భ్రమరాంబ అతిధి గృహం నుండి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా సుండిపెంట హెలిప్యాడ్‌కు 12 గంటలకు చేరుకుంటారు. 12:10 నిమిషాలకు హెలిప్యాడ్‌ నుండి బయలుదేరి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ చేరుకొని అక్కడి నుండి 1:50 నిమిషాలకు రాజ్‌ భవన్‌ చేరుకుంటారు.