ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో ఆర్-5జోన్ పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సోమవారం సిఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లుగా ఇళ్లస్థలాల పంపిణీపై ఎన్నో వివాదాలు ఏర్పడగా మే 26న సిఎం జగన్ వెంకటపాలెంలో 50,793 మందికి ఇళ్ల స్థలాల పంపిణీని ప్రారంభించారు. ఇళ్లస్థలాల పంపిణీపై ప్రతిపక్షాలు,రైతులు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పేదలకు ఇళ్లునిర్మిస్తే రాజధానిలో డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ వస్తుందని హైకోర్టులో అనేక మంది పిటీషన్లు దాఖలు చేశారు. ఇందుకు ప్రభుత్వం పలు మార్లు కౌంటర్లు దాఖలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి తీరాలని పట్టుదలతో ప్రయత్నించింది. సుదీర్ఘ విచారణ అనంతరం స్థలాల పంపిణికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో గతనెల 26 నుంచి స్థలాలు పంపిణీ ప్రారంభమైంది.
మొత్తం 25 లేఅవుట్లలో తగిన మౌలికసదుపాయాలతో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన వారికి స్థలాలతో పాటు వెంటనే ఇళ్లు మంజూరు చేశారు. మొత్తం 47 వేల ఇళ్ల నిర్మాణం చేపటనున్నారు. తొలిదశలో 35 వేల ఇళ్లను షేర్ వాల్ టెక్నాలజీ తో తక్కువ ఖర్చుతో, వేగంగా నిర్మాణాలు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం వెంకటపాలెంలో తెలిపారు. కోర్టు తీర్పులు ఇళ్ల నిర్మాణానికి ఆటంకం కావని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే మంగళగిరి మండలం కష్ణాయ పాలెంలో నిర్మించిన నమూనా గృహాలను ఆయన పరిశీలించారు. వీటిని సోమవారం సిఎం జగన్ కూడా పరిశీలిస్తారు. ఒక్కొ ఇంటికి రూ.2.11 లక్షలు కేటాయించారు. రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజధానిలో టిడిపి హయంలో జనాభా ఏమాత్రం పెరగలేదని తమ హయంలో ఎన్నివేల మంది కొత్త కుటుంబాలు వచ్చాయో తద్వారా సంపద ఎంతపెరిగిందో చూపించేందుకు వైసిపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ఈనెల 8న శంకుస్థాపన చేయాల్సి ఉన్నా కేంద్రం ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు వెనుకంజ వేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో 8వ తేదీన శంకుస్థాపన వాయిదా పడింది. ఇళ్ల నిర్మాణంపై రైతులు కోర్టును ఆశ్రయించగా గత 15 రోజుల్లో ఎటువంటి స్టే ఉత్తర్వులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం వేగం పెరచింది. ఈ మేరకు సిఎం జగన్ సోమవారం కృష్ణాయపాలెం, వెంకటపాలెంలో లబ్ధిదారులకు ఇళ్లనిర్మాణ అనుమతి పత్రాలు అందించనున్నారు.
తొలుత కృష్ణాయపాలెంలో ఇళ్ల నిరాణానికి శంకుస్థాపన చేసి అనంతరం ఇప్పటికే నిర్మించిన నమూనా గృహాలను పరిశీలిస్తారు. తరువాత తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సిఎం ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజిని, జోగి రమేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, రాష్ట్ర గహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరక్టర్ లక్ష్మీషా, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పరిశీలించారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం లే అవుట్ 3లో ఇళ్ల శంకుస్థాపన, ముఖ్యమంత్రి అవిష్కరించనున్న పైలాన్, లే అవుట్‌లో నిర్మించనున్న సామాజిక మౌలిక సౌకర్యాల భవనాల శంకుస్థాపన శిలఫలకం, మోడల్ హౌస్, ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసే ప్లాట్, మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి ట్యాంక్ బండ్, హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు పనులను వారు పరిశీలించి అధికారులతో చర్చించారు. సీఆర్డీఏ పరిధిలోని దాదాపు 35,000 వరకు ఇళ్లు షేర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మిస్తామని మంత్రి సురేష్ చెప్పారు. ప్రతి ఇంటికి నీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు, పూర్తి స్థాయిలో రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసి గేటడ్ కమ్యూనిటీలుగా లే అవుట్ లను ఆరునెలలో తీర్చిదిద్తుతామన్నారు.
సిఎం సభకు వాన భయం
ప్రజాశక్తి - తుళ్లూరు : సిఎం పర్యటనకు వాన భయం వెంటాడుతోంది. ఆదివారం ఉదయం, సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో సోమవారం జరిగే గహ నిర్మాణాలకు శంకు స్థాపన, బహిరంగ సభకు వర్షం ఇబ్బందులు తెచ్చిపెడుతుందేమోనన్న ఆందోళన ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసిపి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సిఎం రాకను పురస్కరించుకొని అధికారులు లే అవుట్‌లో షేర్‌వాల్ టెక్నాలజీ వినియోగించి ఒక నమూనా ఇంటిని నిర్మించగా దీన్ని సిఎం క్షుణ్ణంగా పరిశీలిస్తారని అధికారులు చెబుతున్నారు. సిఎం వస్తున్న నేపథ్యంలో లే అవుట్‌లో స్థలాల చదును పనులు జరుగుతున్నాయి. స్థలాలలో నిలిచిన నీటిని ప్రొక్లయినర్‌తో తీసిన కాల్వలోకి మరలిస్తు న్నారు. లే అవుట్‌లో పచ్చదనం కోసం మొక్కలను సిద్దం చేశారు. వెంకటపాలెంలో సిఎం సభకు దారితీసే మార్గాల్లో పరిశుభ్రత పనులను పంచాయతీ, పారిశుధ్య కార్మికులతో చేయిస్తున్నారు. మందడం పంచాయతీ కార్యా లయం నుంచి సమీపంలోని వాగు వరకు రోడ్డుపై గ్రావెల్ తోలి చదును చేస్తున్నారు. వర్షం కురుస్తున్నా పనులు చకచకా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో సభ సజావుగా సాగుతుందా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.










